ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోర్టుల్లో 4.90కోట్ల పెండింగు కేసులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వందమంది దోషులు తప్పించుకున్న పర్లేదు గానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనే స్లోగన్ పై భారతీయ శిక్షాస్మతి నడుస్తోంది. అయితే న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించిన బాధితులకు సత్వర న్యాయం చేయకుండా ఏళ్లకు ఏళ్లు పెండింగ్ పెట్టడం కూడా వారిని తిరస్కరించడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చిక్కుముడిని విప్పాల్సిన న్యాయస్థానాలు.. ప్రభుత్వాలు మిన్నకుండిపోతున్నాయనే విమర్శలు కొంతకాలంగా వెల్లువెత్తుతున్నాయి.దేశవ్యాప్తంగా ప్రస్తుతం 4.90కోట్ల కేసులు పెండింగులో ఉన్నాయని పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోర్టులు.. ప్రభుత్వాలు అనుసరిస్తున్న నాన్చుడు ధోరణి చూస్తుంటే ఈ కేసులన్నీ పరిష్కారం కావడానికి సుమారు వందేళ్ళైనా పట్టే అవకాశం ఉందనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. కొన్ని కేసుల్లో బాధితులకు వెంటనే న్యాయం జరుగుతుండగా మరికొన్ని కేసులు మాత్రం ఏళ్లకు ఏళ్లు పెండింగులో ఉంటున్నాయి.దీంతో బాధితులు న్యాయం కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కొన్ని కేసులైతే 10 ఏళ్లు.. 15 ఏళ్లు.. 20 ఏళ్లు అంటూ సాగుతుండటం గమనార్హం. ఇటీవల కలకత్తా కోర్టు ఓ పురాతన కేసులో తీర్పును ఇచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో వేసిన పిటిషన్ ను ఇటీవల కోర్టు కేసు కొట్టివేసిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ కేసులో పిటిషన్ వేసిన బాధితులు ఎవరూ హాజరు కాకపోవడంతో కోర్టు కేసు కొట్టి వేసినట్లు సమాచారం.కాగా పెండింగ్ కేసుల విషయంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు విలేకరుల సమావేశంలో స్పందించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 4.90 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఈ కేసుల పరిష్కారానికి న్యాయ వ్యవస్థతో కలిసి ప్రభుత్వం కలిసి పని చేయాలని సూచించారు. అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.సుప్రీం కోర్టు ఈ కమిటీ చీఫ్ గా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై చంద్రచూడ్ పెండింగ్ కేసుల పరిష్కారానికి చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. 4.90 కోట్ల పెండింగ్ కేసులు అనేది పెద్ద సంఖ్య అని తెలిపారు. అంటే న్యాయం కోసం కోట్ల మంది వేచి చూస్తున్నారని వెల్లడించారు. న్యాయం జరుగడం ఆలస్యం అవుతుందంటే వారిని తిరస్కరించడంగానే భావించాల్సి ఉంటుందన్నారు.వీలైనంత వరకు కక్షిదారులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. న్యాయస్థానాలు ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకోవడం ద్వారా పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించుకోవచ్చనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా దేశంలో 4.90కోట్ల పెండింగ్ కేసులంటే మాత్రం న్యాయానికి సంకెళ్లు‘ వేసినట్లే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.