సైబ‌ర్ సెక్యూర్టీలో భాగంగా డేటా ర‌క్ష‌ణ ప్ర‌క్రియ‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సైబ‌ర్ సెక్యూర్టీలో భాగంగా డేటా ర‌క్ష‌ణ గురించి జాతీయ మోడ‌ల్‌ను రూపొందించే ప్ర‌క్రియ‌లో ఉన్నామ‌ని సీజేఐ చంద్ర‌చూడ్ తెలిపారు. వ‌ర్చువ‌ల్ విచార‌ణ‌లు చేప‌ట్టేందుకు హైకోర్టులు సిద్ధంగా ఉండాల‌న్నారు. ఒక‌సారి ఈ-ఫ‌యిలింగ్ జ‌రిగితే, మ‌ళ్లీ ఫిజిక‌ల్ ఫ‌యిలింగ్ అవ‌స‌రం లేద‌న్నారు. న్యాయ‌వాదులు టెక్నాల‌జీలో రాటుదేలాల‌న్నారు. డేటా సెక్యూర్టీ, డేటా ప్రైవ‌సీ గురించి సీజేఐ డీవై చంద్ర‌చూడ్ఇవాళ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సైబ‌ర్ సెక్యూర్టీ అంశంలో డేటా ర‌క్ష‌ణ‌, ప్రైవ‌సీ చాలా కీల‌క‌మైన‌వి, ఆ అంశాల‌ను స్ట‌డీ చేసేందుకు ఓ క‌మిటీని ఏర్పాటు చేశాన‌ని, ఆ క‌మిటీ రిపోర్టు ఇచ్చేందుకు ఎక్కువ టైం తీసుకుంటోంద‌ని, అయితే డేటా సెక్యూర్టీ, ప్రైవ‌సీ అంశంలో జాతీయ మోడ‌ల్‌ను రూపొందించే ప్ర‌క్రియ‌లో ఉన్నామ‌ని డీవై చంద్ర‌చూడ్ అన్నారు. ఒడిశాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. డేటా ర‌క్ష‌ణ‌, ప్రైవ‌సీ అంశంలో జాతీయ మోడ‌ల్‌ను రూపొందిస్తే అప్పుడు మ‌నం పెద్ద అడుగు వేసిన‌ట్లు అవుతుంద‌న్నారు.న్యాయ‌వాదులు, న్యాయ‌వ్య‌వ‌స్థ టెక్నాల‌జీని అల‌వ‌ర్చుకోవాల‌ని, ఫిర్యాదుదారుల ప్ర‌యోజ‌నాల కోస‌మైనా ఇది త‌ప్ప‌ద‌న్నారు. జ‌డ్జీల‌కు టెక్నాల‌జీ తెలియ‌ద‌ని, ఫిర్యాదుదారుల్ని ఇబ్బంది పెట్ట‌లేమ‌న్నారు. హైకోర్టులు టెక్నాల‌జీ వాడాల‌ని, వ‌ర్చువ‌ల్ విచార‌ణ‌లు జ‌ర‌పాల‌ని సీజేఐ కోరారు. కేవ‌లం కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో మాత్ర‌మే కాదు, న్యాయ‌వ్య‌వ‌స్థ వ‌ర్చువ‌ల్ విచార‌ణ‌కు సిద్ధం కావాల‌న్నారు. లాయ‌ర్లు వ‌ర్చువ‌ల్ రీతిలో కేసు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యే అవ‌కాశాన్ని హైకోర్టులు క‌ల్పించాల‌న్నారు.ఈ-ఫ‌యిలింగ్స్ కోసం కోర్టులు సిద్ధం అవుతున్నాయ‌ని, కానీ ఒక‌సారి ఈ-ఫ‌యిలింగ్ జ‌రిగితే, అప్పుడు మ‌ళ్లీ ఫిజిక‌ల్ ఫయిలింగ్ అవ‌స‌రం ఉండ‌కూడ‌ద‌ని సీజేఐ అన్నారు. పేప‌ర్‌లెస్‌, వ‌ర్చువ‌ల్ కోర్టులు ఏర్పాటు చేయాల‌న్న విజ‌న్ త‌న‌కు ఉన్న‌ట్లు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.