మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారు

- 2024 ఫిబ్రవరి 14 న మండమెలిగెతో మహాజాతరకు అంకురార్పణ - 21న సాయంత్రం 6 గంటలకు గద్దెల మీదకు సారలమ్మ, గోవింద రాజులు, పగిడిద్ద రాజులు 22న గద్దె మీదకు రానున్న  సమ్మక్క

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. వనదేవతల సన్నిధిలో పూజారులు ముహూర్తాన్ని ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 14 (బుధవారం)న మండమెలిగెతో మహాజాతరకు అంకురార్పణ జరుగుతుందని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు తెలిపారు. 2024 ఫిబ్రవరి 21న సాయంత్రం 6 గంటలకు సారలమ్మ, గోవింద రాజులు, పగిడిద్ద రాజులు దేవుళ్లను గద్దెల మీదకు తీసుకొస్తారు. 22న సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు. 23 న ఈ దేవుళ్ళుకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే చివరి రోజు 24న దేవుళ్లు వనప్రవేశం చేస్తారు. మహాజాతర 2024 ఫిబ్రవరి 21 (బుధవారం)న మహాజాతర ప్రారంభమై ఫిబ్రవరి 24న ముగుస్తుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న తిరుగువారం కార్యక్రమం ఉంటుందని వివరించారు.

మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ జాతర భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఇది విగ్రహాలు లేని జాతర. సమ్మక-సారలమ్మ జాతర గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజుల పాటు జరుగుతుంది. కుంభమేళ తర్వాత భారీగా భక్తజనం పాల్గొంటారు. రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిషా తదితర పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులతో మేడారం ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తుంది. భక్తి పారవశ్యంతో, పూనకాలతో ఊగిపోతూ లక్షలాది భక్తులు సమ్మక్క-సారలమ్మ మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం జాతరకు కోటిన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.

మహాజాతర ఇలా..

ఫిబ్రవరి 21న (మాఘశుద్ధ ద్వాదశి) సాయంత్రం 6 గంటలకు సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజులు గద్దెలకు చేరుకుంటారు.

ఫిబ్రవరి 22న (మాఘ శుద్ధ త్రయోదశి) ఉదయం 8 గంటలకు కంకవనాన్ని గద్దెల వద్దకు తీసుకొస్తారు. సాయంత్రం 6 గంటలకు సమ్మక్క దేవతను గద్దెకు చేర్చుతారు.

ఫిబ్రవరి 23న (మాఘశుద్ధ చతుర్దశి) భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.

ఫిబ్రవరి 24న (మాఘ శుద్ధ పౌర్ణమి) సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు వనప్రవేశం చేస్తారు.

Leave A Reply

Your email address will not be published.