హరితహారం పేరు మార్చుతూ నిర్ణయం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరు మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మొక్కలు పెంచే ఈ కార్యక్రమాన్ని ఇక నుంచి ‘వన మహోత్సవం’ పేరుతో నిర్వహించాలని డిసైడ్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వహయంలో ఈ కార్యక్రమాన్ని ‘తెలంగాణకు హరితహారం’ పేరుతో నిర్వహించేవారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పేరు మార్చారు. ఉమ్మడి తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు వన మహోత్సవం పేరుతోనే పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. 1950లో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. 75 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న నేపథ్యంలో తాజా కార్యక్రమానికి ‘వజ్రోత్సవ వన మహోత్సవం’గా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పేరు పెట్టింది.తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా, రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ, స్టీరింగ్‌ కమిటీలను కొత్తగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా సమన్వయ కమిటీకి కలెక్టర్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారు. అలాగే రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీకి అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా.. ఎనిమిది మంది ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు.కాగా, తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2015 జూలై 3న ప్రారంభించింది. చిలుకూరు బాలాజీ దేవాలయంలో అప్పటి సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రారంభించారు. తెలంగాణలో మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. 2016లోనే 46 కోట్ల మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా.. మొత్తం 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు

Leave A Reply

Your email address will not be published.