రాజధాని నగరంలో విజృంభిస్తున్న డెంగ్యూ

దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ విజృంభిస్తున్నది. మొత్తం కేసుల సంఖ్య వెయ్యికి దగ్గరగా చేరింది. గత వారంలో కొత్తగా 412 డెంగ్యూ కేసులు నమోదు కావడం ఆందోళన రేపుతున్నది. సెప్టెంబర్‌ నెలలో ఈ వ్యాధి బాగా వ్యాపించింది. సెప్టెంబర్‌ 28 నాటికి ఆ నెలలో మొత్తం 693 డెంగ్యూ కేసులు రిపోర్ట్‌ అయ్యాయి. అయితే ఈ ఏడాది ఆరంభం నుంచి సెప్టెంబర్‌ 21 వరకు 525 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనంతరం వారం రోజుల్లోనే కొత్తగా 412 డెంగ్యూ కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం డెంగ్యూ కేసుల సంఖ్య 937కు చేరింది.ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ నివేదికను సోమవారం విడుదల చేసింది. ఆగస్ట్‌లో కేవలం 75 కేసులు మాత్రమే నమోదైనట్లు తెలిపింది. అయితే డెంగ్యూ వల్ల ఈ ఏడాది ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించలేదని ఆ నివేదికలో పేర్కొంది.కాగా, 2015లో కూడా ఢిల్లీలో డెంగ్యూ విజృంభించింది. ఆ ఏడాది 10,600కు పైగా మొత్తం కేసులు నమోదయ్యాయి. 1996 నుంచి ఢిల్లీలో ఇంత భారీ సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదు కావడం అదే మొదటిసారి.

Leave A Reply

Your email address will not be published.