శబరిమల ఆలయానికి పోటెట్టిన భక్తులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/కేరళ:  కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. బుధవారం తెల్లవారు జాము నుంచి భక్తుల తాకిడి పెరిగిందని ఆలయ నిర్వహణ కమిటీ తెలిపింది. ఈ నెల 11 నుంచి ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారని, ఈ నెల 12న గరిష్ఠంగా 1.07లక్షల మంది ఆలయాన్ని సందర్శించారని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. పంపా నది నుంచి భక్తులను నియంత్రిత పద్ధతిలో ఆలయానికి పంపిస్తున్నామని, ఇందు కోసం ప్రతి పాయింట్‌ వద్ద భ్రదతా సిబ్బందిని నియమించినట్లు శబరిమల ప్రత్యేక అధికారి హరిశ్చంద్ర నాయక్‌ తెలిపారు.రద్దీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేశామన్నారు. క్యూలో వేచి ఉన్న భక్తులకు అల్పాహారం, తాగునీరు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులతో పాటు ఆర్‌ఏఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సేవలను వినియోగించుకున్నట్లు హరిశ్చంద్ర నాయక్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. వార్షిక మండలం-మకరవిళక్కు ఉత్సవాల సందర్భంగా నవంబర్‌ 17న ఆలయ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించారు. తీర్థయాత్ర సీజన్‌లో మొదటి ఆరు రోజుల్లో 2.5 లక్షల మంది భక్తులు అయ్యప్ప ఆలయాన్ని సందర్శించారని, రానున్న రోజుల్లో భక్తుల సంఖ్య పెరిగే సూచనలున్నాయని కేరళ దేవస్వం శాఖ మంత్రి కే రాధాకృష్ణన్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.