సీఎం జగన్‌తో దర్శకుడు రాంగోపాల్ వర్మ భేటి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దర్శకుడు రాంగోపాల్ వర్మ తాడేపల్లిలో ప్రత్యక్షమయ్యారు. సీఎం జగన్‌ను కలిసేందుకు ఆయన క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అరగంటకు పైగా జగన్రాంగోపాల్ వర్మ మధ్య సమావేశం జరిగినట్లు చెబుతున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను అత్యంత రహస్యంగా ఉంచారు. ఆఖరు నిమిషం వరకు ఆయన తాడేపల్లికి వస్తారా.. రారా అనే విషయాన్ని సస్పెన్స్‌లో ఉంచారు. సీఎంను కలిసేందుకు వెళ్లే దారిలో కాకుండా మరోదారి నుంచి రాంగోపాల్ వర్మను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీశారు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే వైసీపీకి రాజకీయంగా అంతో ఇంతో కలిసి వచ్చిందనే భావనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు రాంగోపాల్ వర్మతో భేటీ చాలా కీలకమని చెబుతున్నారు.గత కొంతకాలంగా వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. వైసీపీకి సినీగ్లామర్‌ లేదు. అందువల్ల వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మతో పవన్‌ను ధీటుగా ఎదుర్కొనవచ్చనే ఉద్దేశం జగన్‌కు ఉన్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగా ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి టీడీపీకి సినీగ్లామర్ ఉంది. ఆ తర్వాత వైసీపీలోనూ సినీ నటులు చేరారు. ఏమైందోఏమో గానీ వైసీపీలో ఉన్న సినీ నటులు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు అతి తక్కువ మంది మాత్రమే వైసీపీలో కొనసాగుతున్నారు. ఆ మధ్య చిరంజీవిని రాజ్యసభకు పంపుతారని లీకులిచ్చారు. అయితే ఆయన ఆ ప్రచారాన్ని ఖండించారు. సినీ గ్లామర్ ఉంటే ఓట్లు పడతాయనే భావనలో వైసీపీ నేతలున్నారు. అందువల్ల రాంగోపాల్ వర్మతో జగన్ సమావేశమయ్యారని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.