భారీ వర్షాల బీభత్సం .. పాఠశాలల మూసివేత

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: గత కొన్ని రోజులుగా తమిళనాడును వర్షాలు వీడటం లేదు. ఈ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మాత్రమే కాకుండా ప్రధాన రహదారులపైనా వరద నీరు పోటెత్తింది. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఏకధాటిగా కురుస్తున్న వానలకు పలు జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఈ క్రమంలోనే భారీ వర్షాలకు ప్రభావితం అయిన జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.మరోవైపు.. తమిళనాడు వ్యాప్తంగా వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. జలపాతలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో మిజ్‌గాం తుపానుతో ఉక్కిరిబిక్కిరి అయిన తమిళనాడు.. కోలుకుంటున్న సమయంలోనే మరోసారి భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ రాష్ట్రంలో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి.ప్రస్తుతం కురుస్తున్న వానలతో దక్షిణ తమిళనాడు బాగా ప్రభావితం అయింది. తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షాలకు జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. ఈ జిల్లాల్లో సోమవారం అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఇక ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రిజర్వాయర్లు నిండిపోతున్నాయి. పాపనాశం, పెరుంజని, పెచుపారై డ్యాముల నుంచి నీటిని దిగువకు వదలడంతో తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు నీట మునిగాయి. ఇక సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో స్థానిక ప్రజలు మరింత భయపడుతున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి సిద్ధంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సీఎం స్టాలిన్‌ ఆదేశాలు జారీ చేశారు.వరద సహాయక చర్యలు చేపట్టేందుకు భారీగా ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు బలగాలు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాయి. ఈ క్రమంలోనే మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతలతో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తూత్తుకుడిలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలను దారి మళ్లించగా.. మరికొన్ని సర్వీసులను రద్దు చేశారు.

Leave A Reply

Your email address will not be published.