ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా

.. అయితే తొందరలోనే మీకు గుండె రావచ్చు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఇటీవలి కాలంలో పెరుగుతున్న హఠాత్తు గుండెపోటు మరణాలు కలవరానికి గురి చేస్తున్నాయి. యువకులు సైతం ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఉదంతాలు చూస్తున్నాం. అయితే కొన్ని జాగ్రత్తలతో హార్ట్‌ ఫెయిల్యూర్‌ ముప్పును తప్పించుకోవచ్చునని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ముందస్తు వార్నింగ్‌ బెల్స్‌కు స్పందించాలని కోరుతున్నారు. గుండెపోటుకు ముందు చాలామందిలో కొన్ని లక్షణాలు కన్పిస్తాయని, వాటిని గుర్తించి వైద్యులను సంప్రదించడం ద్వారా ఈ హృద్రోగ మరణాల నుంచి తప్పించుకోవచ్చునని మెడంటా హాస్పిటల్‌కు చెందిన సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ నకుల్‌ సిన్హా పేర్కొన్నారు. గుండెపోటుకు ముందు శారీరకంగా ప్రతి ఒక్కరిలో కొన్ని లక్షణాలు గంటకొట్టి మరీ మనల్ని హెచ్చరిస్తాయని, ఇవి కన్పించిన వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు.

లక్షణాలేంటి?

అలుపు, ఆయాసం, ఊపిరి అందకపోవడం, పని చేసుకోలేకపోవడం, కారణం లేకుండా బరువు తగ్గడం, అరికాళ్లలో చెమటలు వంటి లక్షణాలు కొద్ది రోజులుగా లేదా వారాలుగా కన్పిస్తే.. గుండె జబ్బు ఉన్నట్టే అంటున్నారు వైద్య నిపుణులు. ఈ లక్షణాలు కన్పించినా, చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఏ క్షణమైనా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. శరీరంలోని భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడంలో ఏర్పడిన అడ్డంకే గుండెపోటుకు దారితీస్తుంది. రక్తాన్ని సరఫరా చేసే ధమని బ్లాక్‌ కావడంతో ఈ పరిస్థితి వస్తుంది.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

తినే ఆహారంలో కొవ్వులు తక్కువగా ఉండాలి. మాంసం, పాల పదార్థాలను మితంగా తీసుకోవాలి. ఫైబర్‌ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లను తినాలి. పొటాషియం ఎక్కువగా ఉండే టమాట, వేరుశనగ, అరటి పండ్లు ఆహారంలో ఉండేలా చూడాలి. ఉప్పు తక్కువగా వాడాలి, సిగరెట్లు, బీడీలు, మద్యపానం గుండెపోటు ముప్పును 70 శాతం అధికం చేస్తుంది. వ్యాయామాలతో గుండె జబ్బును దరి చేరనీయకుండా చేయొచ్చు. హృద్రోగం ముందస్తు లక్షణాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. అవి పంపే డేంజర్‌ బెల్స్‌కు స్పందించాలి. అప్పుడే దేశంలో సంభవిస్తున్న ఈ హఠాత్తు గుండెపోటు మరణాలను మనం 90 శాతం వరకు నిరోధించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మారిన జీవన విధానం..

గతంలో 65 ఏండ్లు దాటిన వారికే హృద్రోగ వ్యాధులు ఎక్కువగా వచ్చేవి. అయితే ప్రస్తుతం మారిన జీవన విధానం కారణంగా యువకుల్లో సైతం ఈ ప్రమాదం పొంచి ఉంది. కాలుష్యం, ఎలాంటి వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి అధికంగా ఉండే వృత్తి, ఉద్యోగాలు, ఫాస్ట్‌ఫుడ్‌ లాంటివి అధికంగా తినడం వల్ల యుక్త వయసు వారు సైతం దీని బారిన పడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.