వైసీపీకి ఇక ఎంపీ విజయసాయిరెడ్డి అవసరం లేదా..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వైసీపీలో ఆయన నంబర్-2 గా ఉంటూ వచ్చారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీలో ఏ పని చేయాలన్నా.. ఎవరికేం కావాలన్నా ఆయనే చూసుకునేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా పార్టీలో పరిస్థితి ఉండేది. ఇంకా చెప్పాలంటే జగన్ దగ్గరికి వెళ్లాలన్నా.. ఎవరికైనా టికెట్లు, పదవులు కావాలన్నా మొదట ఆయన ఆశీస్సులు కావాల్సిందే. ఇవన్నీ నిన్న, మొన్నటి దాకా ఉన్న పరిస్థితులు. అయితే ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయిందట. నంబర్-2 గా ఉన్న ఆయన పరిస్థితి పార్టీలో ఇప్పుడు దారుణాతి దారుణంగా ఉందట. ఒక్కరంటే ఒక్కరూ ఆయన్ను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడట. ఒకప్పుడు ఆయనకు వంగి వంగి దండాలు పెట్టే వైసీపీ శ్రేణులు.. ఇప్పుడు ఆయన్ను చూసి మరీ ఎదురెళ్తున్నారే కానీ పలకరించే పరిస్థితుల్లేవట. దీనంతటికీ కారణం ఒకే ఒక్క సంఘటన అని.. ఆ ఒక్క ఘటనతోనే ఆయన పరిస్థితి ఇలా తయారయ్యిందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇంతకీ ఎవరా నేత..? ఎందుకీ పరిస్థితి వచ్చింది..? అన్నది పరిశీలిస్తే …వైసీపీలో నంబర్-2 అనేసరికి ఆయనెవరో ఇప్పటికే అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఆయన మరెవరో కాదండోయ్ ఎంపీ విజయసాయిరెడ్డే వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి నమ్మిన బంటు. జగన్ పార్టీ పెట్టక ముందు నుంచే రైట్ హ్యాండ్‌గా ఉంటూ వస్తున్నారు. వైసీపీ ఆవిర్భావంలో సాయిరెడ్డి కీలక పాత్రే పోషించారు. అప్పట్లో పార్టీలో చేరికలు, ఎవర్ని ఎక్కడ్నుంచి పోటీ చేయించాలనే విషయాలన్నీ ఈయనే చూసుకునేవారట. పార్టీకి జగన్ నంబర్-1 అయితే ఆయన తర్వాత సాయిరెడ్డే అన్నట్లుగా మొదట్నుంచీ.. నిన్న మొన్నటి వరకూ వ్యవహరిస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికలు తర్వాత ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్యనేతలు వైసీపీని వీడినా ఈయన మాత్రం వైఎస్ ఫ్యామిలీపై విధేయతతోనే ఉన్నారు. కార్యకర్తలకు భరోసా ఇస్తూ.. అప్పట్లో వైసీపీ నేతలపై కేసులు నడిచినా సరే అన్ని విధాలుగా వారికి అండగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వ్యవహారాలన్నీ విజయసాయే చూసుకునేవారు.ఎందుకో ఈ మధ్య..!2019 ఎన్నికల్లో వైసీపీ విజయానికి వైఎస్ జగన్ కంటే ఎక్కువగానే గ్రౌండ్ వర్క్ చేశారని ఆయన్ను దగ్గర్నుంచీ చూసిన వ్యక్తులు చెబుతుంటారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర బాధ్యతలు సాయిరెడ్డికి అప్పగించారు జగన్. వైసీపీ పార్లమెంటరీ నేతగా, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వైసీపీలో ఇంత కీలకంగా ఉన్న వ్యక్తికి జగన్ ఝలక్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర బాధ్యతలు బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి కట్టబెట్టారు జగన్. ఈ మార్పు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే జరిగింది. ఆ తర్వాత వైసీపీలో అత్యంత కీలకంగా ఉన్న సోషల్ మీడియా వింగ్ కూడా విజయసాయిరెడ్డి చేతుల్లో ఉండేవి. అయితే అనూహ్యంగా ఈ బాధ్యతల నుంచి కూడా ఆయన్ను తప్పించారు. వైసీపీలో కీలకంగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి అప్పగించారు. రీజనల్ కో ఆర్డినేటర్లను నియమించినా.. పార్టీ సమన్వయకర్త పదవి సజ్జలకే కట్టబెట్టింది అధిష్టానం. అటు ఉత్తరాంధ్ర ఇంచార్జ్ బాధ్యతలు.. ఇటు సోషల్ మీడియా రెండూ సాయిరెడ్డికి దూరమయ్యాయి.

ఇవన్నీ పోగా మిగిలిన పార్టీ అనుబంధ విభాగాలకే పరిమితం చేశారు. ఈ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ ప్రధాన కార్యాలయంలో గట్టిగానే హడావుడి చేశారు కానీ ఆ తర్వాతే ఎందుకో సాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చిందని ఆయన అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. ఎందుకో ఆయనలో ఇదివరకున్న జోష్ కనిపించలేదు. అసలే ప్రాధాన్యత తగ్గుతున్న సమయంలో ఊహించని రీతిలోనే అధిష్టానం ఝలక్ ఇచ్చింది. సాయిరెడ్డి అధ్యక్షుడిగా ఉండే అనుబంధ సంఘాలకు బాధ్యులను అధిష్టానం నియమించింది. ఇలా ఫలానా వ్యక్తులకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఒక్కమాట కూడా చెప్పలేదట. పైగా సాయిరెడ్డి స్థానంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుతో లిస్టులు విడుదలయ్యాయి. సీఎం జగన్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నియామకాలు జరిగాయి. 13 జిల్లాల్లో యువజన, మహిళా, రైతు, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, వైద్య, క్రిస్టియన్, మైనార్టీ, వాణిజ్య, స్టూడెంట్ విభాగాలకు అన్నింటికీ అధ్యక్షులను నియమించారు జగన్. ఇంత కీలక నియామకాలు జరుగుతున్నా నంబర్-2కు అస్సలు సమాచారమే లేదట. ఈ లిస్టులు చూసిన పార్టీ శ్రేణులు కంగుతిన్నాయట.

ఇదే అసలు కారణమా..?

ఈ మొత్తం వ్యవహారానికి కారణం ఒక్కటేనట. సినీ నటుడు నందమూరి తారకరత్న చనిపోయినప్పుడు రెండ్రోజులు పాటు హైదరాబాద్‌లో ఉండి అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ అన్నీ తానై చూసుకున్నారు సాయిరెడ్డి. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి విజయసాయిరెడ్డికి కుమార్తె వరుస అవుతుంది. సాయిరెడ్డి భార్య, చెల్లెలి కుమార్తే అలేఖ్యారెడ్డి. ఈ బంధుత్వంతో తారకరత్న చనిపోయారని తెలిసిన మరుక్షణం నుంచి అంత్యక్రియల వరకూ దగ్గరుండే చూసుకుని ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. వాస్తవానికి ఈ విషయాన్ని ఎవరూ తప్పుబట్టడానికి లేదు. అయితే కొందరు వైసీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టేశారు. ముఖ్యంగా.. నందమూరి కుటుంబ సభ్యుల్లో నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌తో రాసుకుపూసుకుని తిరిగారు. అన్నింటికీ మించి బాలయ్యపై పదే పదే పొగడ్తలు కురిపించడం లాంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు) పక్కనే కూర్చోని మాట్లాడుకోవటం, ఆ తర్వాత ప్రెస్‌మీట్‌కు ఇద్దరూ కలిసే రావడంతో వైసీపీలో పెద్ద చర్చకే దారితీసింది. ఇవన్నీ పక్కనెడితే.. చంద్రబాబును కారు దాకా వెళ్లి ఎక్కించడం లాంటి దృశ్యాలు వైసీపీలో మంటలు రేపుతున్నాయి. ఇదేంటి.. నిన్న, మొన్న దాకా ఉప్పు-నిప్పులా ఉన్న చంద్రబాబు, సాయిరెడ్డి ఇలా కలవడం వైసీపీ పెద్దల ఆగ్రహానికి కారణమైందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందుకే సాయిరెడ్డికి తెలియకుండానే అనుబంధ సంఘాల వ్యవహారం అధిష్టానం కానిచ్చేసిందట. వాస్తవానికి సజ్జల ఎంట్రీ తర్వాత సాయిరెడ్డి స్థానం ఆయనకు వచ్చిందని ఎప్పట్నుంచో హడావుడి జరుగుతోంది.

Leave A Reply

Your email address will not be published.