రష్యా రాజధాని మాస్కో పై డ్రోన్ల దాడి

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: రష్యా రాజధాని నగరం మాస్కోపై అనేక డ్రోన్లతో దాడి జరిగింది. అయితే నష్టం స్వల్పమేనని, ఎవరూ తీవ్ర స్థాయిలో గాయపడలేదని నగర మేయర్ సెర్గీ సొబ్యనిన్ ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలోని ఎమర్జెన్సీ సర్వీసులన్నిటినీ రంగంలోకి దించినట్లు, అవసరమైన చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.మాస్కో రీజియన్ గవర్నర్ ఆండ్రీ వొరొబ్యోవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, మాస్కో నగరంలోకి ప్రవేశించేందుకు వస్తున్న చాలా డ్రోన్లను మధ్యలోనే కూల్చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ డ్రోన్లను ఎవరు ప్రయోగించారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మాస్కో, దాని శివారు ప్రాంతాల్లో సుమారు 10 డ్రోన్లను కూల్చేసినట్లు సమాచారం. కొందరు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రొఫ్సోయుజ్నయ వీథిలోని ఓ భవంతిలో ఉన్నవారిని వేరొక చోటుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి విపరీతమైన నష్టం జరుగుతున్న సంగతి తెలిసిందే. రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు ఆయుధాలు, తదితర రూపాల్లో మద్దతు ఇస్తున్నాయి. మన దేశం తటస్థంగా ఉంటూ, శాంతియుత పరిస్థితులు ఏర్పడాలని కోరుకుంటోంది. ఐక్యరాజ్య సమితి చార్టర్‌కు అనుగుణంగా నడచుకోవాలని ఇరు దేశాలను కోరుతోంది. ఇది యుద్ధాలు చేయడానికి తగిన కాలం కాదని చెప్తోంది.

Leave A Reply

Your email address will not be published.