అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: అరుణాచల్ ప్రదేశ్‌లో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.7గా నమోదయినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ సియాంగ్‌లోని బసార్‌కు ఉత్తర వాయువ్యంగా 52 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం గుర్తించినట్టు పేర్కొంది. భూమి ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్టు వెల్లడించింది. భూకంపం నష్టం గురించి ఇంకా ఎటువంటి సమాచారం అందలేదని చెప్పింది. అటు, యూరోపియన్-మెడిటెరియన్ సిస్మాలాజికల్ సెంటర్ సైతం భారత్‌లోని ఈశాన్య ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం సంభవించిందని, ఇది రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతగా నమోదయ్యిందని ప్రకటించింది. ఇక, ముందురోజే నేపాల్‌లో 6.3 తీవత్రతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ఢిల్లీని వణికించింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.57 గంటల సమయంలో ఢిల్లీ సరిహద్దుల్లోని నోయిడా, గుర్గావ్ ప్రాంతాల్లో పది సెకన్ల పాటు ప్రకంపనాలు సంభవించాయి. దీంతో జనాలు ఒక్కసారిగా భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనలు ట్విట్టర్‌లో కూడా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ భూకంపం రిక్టర్‌ స్కేల్‌పై 6.3 తీవ్రతగా నమోదయ్యిందని, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ సిస్మోలజీ కేంద్రం తెలిపింది.నేపాల్‌లో రెండుసార్లు భూమి కంపించింది. మంగళవారం రాత్రి 8.52 గంటలకు 4.9 తీవ్రతతో ఒకసారి, రాత్రి 9.41 గంటలకు 3.5 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. అలాగే, బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు 6.3 తీవ్రతతో మూడోసారి భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దోతి జిల్లాలో నివాస భవనాలు కూలిపోయారు. ఉత్తరాఖండ్, యూపీ, మణిపూర్‌తో పాటూ కొన్ని రాష్ట్రాల్లో భూమి కంపించినట్లు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.