యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన భూప్రకంనలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తుర్కియే.. సిరియాల్లో ఇటీవల చోటుచేసుకున్న వరుస భూకంపాలు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భూకంపాలు అతి ఎక్కువ వచ్చే ప్రాంతాల్లో తుర్కియే.. సిరియాలు ఉన్నాయి. గతంలోనూ ఈ దేశాలు భూకంపాల కారణంగా ఎంతో నష్టాన్ని చవిచూశాయి. వరుస భూకంపాలతో ఆయా ప్రాంతాల్లో భారీ భవంతులన్నీ పేకమేడల్లా కుప్పకూలాయి. దీనికితోడు తరుచూ భూప్రకంనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో భూకంప బాధితులకు అందించే సాయంలో పలు ఆటంకాలు జరిగాయి. మరోవైపు భూకంపం కారణంగా రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో శిథిలాల కింద ఇరుక్కుపోయిన బాధితులను ఆస్పత్రులకు తరలించాలన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తుర్కియే.. సిరియాలో భూకంపాల కారణంగా ఇప్పటికే 15 వేలకు పైగా మృత్యువాత పడటం శోచనీయంగా మారింది. ఒక్క తుర్కియేలోనే 12వేల 391 మంది మృతిచెందగా సిరియాలో సుమారు మూడు వేల వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు రెండు దేశాల్లో కలిపి 15వేల 383 మంది మృతిచెందగా వేలాది మంది క్షతగాత్రులు గ మారారు.మరోవైపు శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. వీటి కింద లక్షలాది ప్రజలు చిక్కుకున్నారు. వీరిని బయటికి తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. ఈక్రమంలోనే మృతుల సంఖ్య సైతం భారీగా పెరిగే అవకాశం కన్పిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్ది ఈ సంఖ్య మరింత పెరిగేలా కన్పించడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.తుర్కియేలో సోమవారం నాటి భూకంపాల కారణంగా ఆ దేశంలోని పది ప్రావిన్స్ లు నామరూపాల్లేకుండా పోయాయి. ఒక్కో భవనం కింద సుమారు 400 నుంచి 500 వరకు చిక్కుకుపోయారు. అయితే వీరిని కాపాడేందుకు కనీసం 10 మంది సహాయ సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడం.. శిథిలాలను తొలగించే పరికరాలు.. యంత్రాలు సైతం లేకపోవడంతో తుర్కియే అధ్యక్షుడు రెసెస్ తయ్యుప్ ఎర్డోగాన్ ఫై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈక్రమంలోనే భూకంప ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించారు. భూకంప బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను సందర్శించి మాట్లాడారు. సహాయ చర్యల్లో లోపాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే ఈ ఘోర విపత్తును ముందుగా ఊహించినా సిద్ధపడటం సాధ్యం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో మన కళ్లే ముందే కన్పిస్తుందని ఇలాంటి విపత్తుకు ముందుగా సిద్ధపడటం ఎవరికీ సాధ్యం కాదని తెలిపారు.కాగా తుర్కియే ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే ఆ దేశ రాజధాని అంకారా సహా పలు నగరాల్లో ట్విటర్ పై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. తుర్కిష్ మొబైల్ నెట్ వర్క్ లో ట్విట్టర్ పని చేయడం లేదని నెట్ బాక్స్ అనే వెబ్ మానిటరింగ్ సంస్థ వెల్లడించింది. అయితే అసత్య ప్రచారాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భూకంపాల్లో సర్వం కోల్పోయిన బాధితులు రోడ్డున పడ్డారు. గడ్డకట్టే చలిలో వారంతా తాత్కాలిక శిబిరాల్లో తల దాచుకోవడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. గత సోమవారం తెల్లవారుజామున తుర్కియేలో 7.8 తీవ్రతతో భారీ భూకంప రావడంతో భారీగా ప్రాణ నష్టం.. ఆస్తి నష్టం వాటిల్లిన సంగతి తెల్సిందే.

Leave A Reply

Your email address will not be published.