తెలంగాణ ఎన్నికల పై ఈసీఐ కసరత్తు

-  ఎన్నికలకు సన్నద్ధ మవుతున్న బీఆర్‌ఎస్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ఎన్నికల పై ఈసీఐ కసరత్తు ప్రారంభించింది. ముగ్గురు సీనియర్‌ అధికారుల బృందంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో ఈసీఐ సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై చర్చించారు. అన్ని స్థాయిలలో పోల్ అధికారులకు శిక్షణ, పోలింగ్‌ శాతం పెంచే కార్యక్రమాలపైనా సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితాలను నిరంతరం పర్యవేక్షించాలని, ఫుల్‌ప్రూఫ్ జాబితా ఉండేలా చూడాలని అధికారులకు ఈసీఐ ఆదేశాలిచ్చింది.

ఈ నూతన సంవత్సరం అన్ని పార్టీలకూ రాజకీయంగా కీలకం. ఫిబ్రవరి నుంచి డిసెంబరు వరకు 9 రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాదిలోనూ ఎన్నికలు జరుగనుండడమే దీనికి కారణం. ఫిబ్రవరి-మార్చిలో త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ ఎన్నికలు జరుగాయి. ఏడాది చివరిలో మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాజస్థాన్‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మిజోరం అసెంబ్లీ పదవీకాలం డిసెంబరు 17న, ఛత్తీస్‌గఢ్‌-2024 జనవరి 3, మధ్యప్రదేశ్‌-2024 జనవరి 6, రాజస్థాన్‌-2024 జనవరి 14, తెలంగాణ అసెంబ్లీకి 2024 జనవరి 16న పదవీకాలం ముగుస్తుంది.

ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం

అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరులోనే జరుగుతాయని, సెప్టెంబరు, అక్టోబరులో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశముంటుందని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో ఆ పార్టీ అందుకు తగినట్లుగా సమాయత్తమవుతోంది. ‘‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే.. మనం సిద్ధంగా ఉండాలి. సమయం లేదు.. జనంలోనే ఉండండి’’ అంటూ ఇటీవలే బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలను కేసీఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. నోటిఫికేషన్‌ ఎప్పుడొచ్చినా క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉండాలన్న దిశగా ఆ పార్టీ ఎన్నికల కార్యాచరణ మొదలుపెట్టింది. ఇందులో ప్రజలకు చేరువయ్యేలా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. దీంతోపాటు నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులను ఏకం చేయడం ద్వారా పార్టీ ప్రయోజనాలపై దృష్టి పెట్టేలా కార్యాచరణ చేపట్టనుంది. ఈ మేరకు విస్తృతంగా పార్టీ కార్యక్రమాల నిర్వహణకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కసరత్తు మొదలు పెట్టారు.మరోవైపు సాధారణ ఎన్నికల ఏడాది కావడంతో కమలం పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే కాషాయ పార్టీ కసరత్తు కూడా ప్రారంభించింది. తెలంగాణ లో అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో బీజేపీ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రూపొందించిన త్రిముఖ వ్యూహం విజయవంతం కావడంతో ఇక్కడ కూడా అమలు చేయాలని కాషాయ నేతలు భావిస్తున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్నాయ్‌.. అప్రమత్తంగా ఉండండి: డీజీపీ

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్‌ సూచించారు. రాజకీయ పక్షాలు, సంస్థలు పాదయాత్రలు, బహిరంగ సభలు నిర్వహించినప్పుడు బందోబస్తు ఓ పరీక్షలాంటిందని, ఈ సందర్భంగా ఎదురయ్యే సవాళ్లను సరికొత్త వ్యూహంతో పరిష్కరించాలన్నారు. ఇందులో స్పెషల్‌ బ్రాంచ్‌ల పనితీరు అత్యంత కీలకమని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.