రణరంగంగా ‘గ్రహణ భోజనం’

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గ్రహణాలపై ప్రజల్లో మూఢనమ్మకాలు, అపోహలను తొలగించేందుకు హేతువాదుల ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. హేతువాదులు చేపట్టిన కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనకు దిగి దాడులకు పాల్పడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని, ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. చంద్ర గ్రహణంపై ఉన్న అపోహలను తొలగించే పేరుతో ‘మానవతావాది హేతువాది సంస్థ’ గంజాం సిటీ హైస్కూలు రోడ్డులోని చారవాక్‌ భవన్‌ వద్ద మంగళవారం మధ్యాహ్నం ప్రజా చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించింది.ప్రజలతో సామూహిక భోజనాలకు ఏర్పాట్లు చేసింది. హెచ్‌ఆర్‌ఓ చేపట్టిన కార్యక్రమాన్ని బ్రాహ్మణ పురోహిత సమితి, భజరంగదళ్‌, విశ్వహిందూ పరిషత్‌ తదితర హిందూ సంస్థలు వ్యతిరేకించాయి. హెచ్ఆర్ఓ సంస్థకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు, రహదారిపై బైఠాయించి నిరసనలు తెలిపాయి. ఈ క్రమంలో చారవాక్ భవన్‌కు రెండువైపుల నుంచి ఒక్కసారిగా కర్రలతో చుట్టుముట్టి వారితో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాటకు దారితీయగా.. హెచ్‌ఆర్‌ఓ ప్రతినిధులపై కొందరు పేడతో దాడి చేశారు. నాటు బాంబులు కూడా విసిరారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి చేజారి రణరంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలకు చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ వెనక్కుతగ్గని హిందూ సంఘాలు చారవాక్‌ భవన్‌ వద్దకు చేరుకుని వ్యతిరేక నినాదాలు చేశారు. చివరకు పోలీసులు హెచ్‌ఆర్‌ఓ ప్రతినిధులకు నచ్చజెప్పి, వారిని భద్రత మధ్య అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. గ్రహణ భోజనాన్ని బలవంతంగా అడ్డుకోవడం, దాడి దారుణమని హెచ్‌ఆర్‌ఓ ప్రతినిధులు మండిపడ్డారు. ‘‘మేము సైన్స్‌ని నమ్ముతాం.. మూఢనమ్మకాలపై మాకు నమ్మకం లేదు.. వారు సైన్స్ ద్వారా ఏమీ నిరూపించలేరు కాబట్టి వారు మాపై దాడి చేయడానికి, సైన్స్ అండ్ టెక్నాలజీని నమ్మే విశాలదృక్పథం ఉణ్న ప్రజలలో భయాందోళనలను వ్యాప్తి చేయడానికి ఇక్కడకు వచ్చారు’’ అని మండిపడ్డారు. ముందు జాగ్రత్తగా చారవాక్‌ భవన్‌ వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేయడంతో భారీ విధ్వంసం తప్పింది. గంజాం అదనపు ఎస్పీ అసీమ్‌ పండా, బ్రహ్మపుర ఎస్డీపీఓ రాజీవ్‌ లోచన్‌ పండా, పెద్దబజారు, టౌన్‌ ఠాణాల ఐఐసీలు ప్రశాంత భూపతి, సురేష్‌ త్రిపాఠి ఇతర అధికారులు శాంతిభద్రతల్ని పర్యవేక్షించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్, బరంపూర్‌లోనూ హేతువాదులకు వ్యతిరేకంగా భజరంగ్ దళ్ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించి నిరసనలు తెలియజేయడం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.