తిరుమలపై మాండూస్ తుఫాను ఎఫెక్ట్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ తుఫాన్ తీరం దాటింది. తమిళనాడులోని మహాబలిపురం వద్ద తుపాను తీరం దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. మాండౌస్ తుఫాన్ తిరుపతి నగరాన్ని అస్తవ్యస్తం చేసింది. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరింది.రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుపతిలోని మాల్వాడి గుండం ఉద్ధృతంగా కనిపిస్తోంది. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన వర్షపు నీరు మొత్తం కూడా మాల్వాడి గుండం మీదుగా.. కపిలతీర్థంకు చేరుకుంటోంది. దీంతో.. భక్తులను కపిలతీర్థం వద్దనున్న పుష్కరిణిలోకి అనుమతించడం లేదు. అలాగే తిరుమలలో భారీ వర్షానికి వృక్షాలు కూలాయి. ఏఎన్సీ 441 వద్ద రోడ్డుకి అడ్డంగా వృక్షం కూలింది. ఈ ఘటనలో పారిశుధ్య కార్మికురాలు గాయపడగా.. ఆసుపత్రి కి తరలించారు. తుఫాన్ ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో టీటీడీ చర్యలు చేపట్టింది. తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను నిలిపివేశారు. పాపవినాశనం, శిలాతోరణం మార్గాలను మూసివేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా క్రేన్లు, ఆటో క్లీనింగ్ వాహనాలను సిద్ధం చేశారు. అటు వర్షం కారణంగా శ్రీవారి మెట్టు మార్గం గుండా వరదనీరు ప్రవహిస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు శుక్రవారం ఉదయం నుంచి తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. వాతావరణం కూడా చల్లగా మారింది.

Leave A Reply

Your email address will not be published.