టీడీపీతో బీజేపీ పొత్తుపై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మళ్లీ బలోపేతం కావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీతో పొత్తు కోసం, వచ్చే ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకొని పావులు కదుపుతున్నారని, అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ విషయంపై స్పందించారు.

తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పై విలేఖరులు అడిగిన ప్రశ్నకు స్పందించిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బిజెపి ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పార్టీ కాదని, సొంతంగా బలపడే పార్టీ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణాలో బీజేపీకి ప్రజల మద్దతు ఉందన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు ఖమ్మం సభ పైన వ్యాఖ్యలు చేసిన ఆయన తెలుగుదేశం పార్టీకి తెలంగాణ వాసన, పునాది రెండు ఉన్నాయి అని చెప్పారు. టిడిపి ఏమి నిషేధించిన పార్టీ కాదని, తెలుగు దేశం పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని గతంలో చంద్రబాబు కూడా చెప్పారని ఈటల రాజేందర్ గుర్తుచేశారు.

తెలుగుదేశం పార్టీ ఎప్పటినుంచో ఉన్న పార్టీ అని పేర్కొన్న ఆయన దేశంలో ప్రతి పార్టీకి ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రంతో టిడిపికి సంబంధం ఉంది కాబట్టే చంద్రబాబు తెలంగాణలో సభలు పెడుతున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కచ్చితంగా గెలవబోతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయం అని చెప్పిన ఈటల రాజేందర్ తాము ఏ పార్టీ పైన ఆధారపడమని, సొంతంగా బలోపేతం అవుతామని చెప్పుకొచ్చారు.

Leave A Reply

Your email address will not be published.