రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఈటల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగానే తాను మాట్లాడానని.. ఎవరినీ కించపరచలేదన్నారు. తాను రేవంత్‌రెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావించలేదని, పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ బీఆర్ఎస్‌ కలిసి ఉన్నాయని అన్నారు. రేవంత్‌ కన్నీళ్లు పెట్టుకుంటూ కూడా అసభ్యంగా మాట్లాడారని.. రాజకీయ నేతలు కన్నీళ్లు పెట్టడం మంచిదికాదని ఈటల వ్యాఖ్యానించారు. అయినా రేవంత్‌రెడ్డికి, తనకు పోలిక ఏంటని ప్రశ్నించారు. తాను విద్యార్థి నేతగా ఉన్నప్పటి నుంచే పోరాటాలు చేస్తున్నానని, ఓటుకు నోటుకు కేసులో రేవంత్‌ జైలుకువెళ్లి వచ్చారని, ఆయన సంస్కారహీనంగా మాట్లాడారని ఈటల రాజేందర్ విమర్శించారు.బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటెల రాజేందర్ రాజకీయంగా దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. మునుగోడు ఎన్నికల్లో రూ.25 కోట్లు కాంగ్రెస్‌కు సీఎం కేసీఆర్ ఇచ్చారని ఈటల దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక్క రూపాయి కూడా టీఆర్ఎస్ నుంచి గానీ, ముఖ్యమంత్రి నుంచి సాయం పొందలేదని స్పష్టం చేశారు.మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి కార్యకర్తలు చందాలు వేసుకున్నవేనని, కాంగ్రెస్ పార్టీలోని బలహీన వర్గాల నాయకులే మునుగోడు ఎన్నికలకు ఆర్థిక సాయం చేశారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వారి శ్రమను, ఆర్థిక సాయాన్ని అవమానించేలా ఈటెల మాట్లాడటం సమంజసం కాదని, బీజేపీ నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారిని నమ్ముతారని, శనివారం సాయంత్రం 6 గంటలకు వాళ్లు నమ్మే భాగ్యలక్ష్మి టెంపుల్‌లో దేవుడిపై ఒట్టేసి చెబుతానని అన్నారు. తనపై ఆరోపణలను ఈటెల నిరూపించడానికి సిద్ధమా? అని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్‌లో తడి బట్టలతో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, రాజకీయాల కోసం ఈటెల దిగజారి మాట్లాడటం క్షమించరాని నేరమన్నారు. తనపై ఆరోపణలను రాజేందర్ 24 గంటల్లో నిరూపించాలని, శనివారం సాయంత్రం 6 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఈటెల సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. భాగ్యలక్ష్మి దేవుడిపై నమ్మకం లేకుంటే.. ఏ ఆలయంలో నైనా తడి బట్టలతో ప్రమాణానికి తాను సిద్ధమని రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్‌కు సవాల్ విసిరారు.

Leave A Reply

Your email address will not be published.