ప్రతి ఇల్లూ సిరిసంపదలతో తులతూగాలి

-  దేశ, రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు సీఎం కేసీఆర్‌ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పంటపొలాల నుంచి ధాన్యం ఇంటికి చేరిన సమయంలో జరుపుకునే పండుగే సంక్రాంతి అని, నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ పల్లెలు పచ్చని పంటపొలాలతో సంక్రాంతి శోభను సంతరించుకున్నాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయరంగం సాధించిన ప్రగతి యావత్‌ దేశానికి మార్గదర్శనంగా నిలిచిందని చెప్పారు.వ్యవసాయరంగం బలోపేతం కోసం కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2,16,000 కోట్లకుపైగా ఖర్చుచేసిందన్నారు. రైతుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికున్న నిబద్ధతకు ఇది తార్కాణమని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి కోటి 31 లక్షల ఎకరాలు మాత్రమే సాగు విస్తీర్ణం ఉన్నదని, నేడు అది 2 కోట్ల 4 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. దేశ వ్యవసాయరంగంలో విప్లవాత్మక పరిణామమని చెప్పారు.ఒకనాడు దండుగ అన్న వ్యవసాయం నేడు తెలంగాణలో పండుగలా మారిందన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుంటే జీవితానికి ఢోకా లేదనే విశ్వాసం తెలంగాణ రైతుల జీవితాల్లో తొణికిసలాడుతోందని వెల్లడించారు. ఇదే విశ్వాసాన్ని దేశ రైతాంగంలో పాదుకొల్పుతామని చెప్పారు. యావత్‌ భారత్‌ ప్రజల సహకారంతో దేశ వ్యవసాయరంగ నమూనాను మార్చి గుణాత్మక అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరముందన్నారు. ప్రజలంతా సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని, ప్రతి ఇల్లూ సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.