తగ్గుముఖం పట్టిన  బంగారం ధర    

- నెల రోజుల్లో రూ.3000 తగ్గిన తులం బంగారం ధర

తెలంగాణా జ్యోతి/వెబ్ న్యూస్: ఫెస్టివ్ సీజన్ ప్రారంభమైంది. మరోవైపు కార్తీక మాస పెండ్లిండ్ల సీజన్ రాబోతున్నది. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. నెల రోజుల్లో తులం బంగారం ధర రూ.3000 తగ్గుముఖం పట్టింది.గతంలో పండుగలు.. పెండ్లిండ్ల సీజన్‌లో బంగారం ధరలు పెరిగేవి. కానీ ప్రస్తుతం గ్లోబల్, దేశీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు పూర్తిగా దిగి వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజుల్లో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.2950 దిగి వచ్చింది. బుధవారం (అక్టోబర్ 4) తులం బంగారం రూ.57,300 వద్ద ముగిసింది.తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.190 తగ్గి రూ.52,590 పలికింది. 24 క్యారట్స్ తులం బంగారం రూ.210 పతనమై రూ.57,370 వద్ద నిలిచింది. ఢిల్లీలో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం (గురువారం, అక్టోబర్ 5) రూ.200 తగ్గి రూ.52,550 పలికింది.సెప్టెంబర్ ఐదో తేదీన ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.60,300 (సెప్టెంబర్ నాలుగో తేదీన రూ.60,450) పలికితే, గురువారం రూ.57,350కి దిగి వచ్చిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. గ్లోబల్ మార్కెట్‌కు అనుగుణంగా దేశీయంగా ధరలు దిగి వస్తున్నాయని హెచ్డీఎఫ్సీ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. మరోవైపు కిలో వెండి ధర గురువారం రూ.300 పెరిగి రూ.71,300 వద్ద స్థిర పడింది.అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1820 డాలర్లు, వెండి 21.15 డాలర్లు పలికింది. సెప్టెంబర్ ఐదో తేదీన గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం 1936 డాలర్లు, ఔన్స్ వెండి ధర 23.60 డాలర్లు వద్ద నిలిచింది. నెల రోజుల్లో అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం 116 డాలర్లు పతనం కావడం గమనార్హం.ఫ్యూచర్స్ మార్కెట్ (మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్-ఎంసీఎక్స్)లో తులం బంగారం (24 క్యారట్స్) డిసెంబర్ డెలివరీ ధర రూ.10 తగ్గి రూ.56,711 వద్ద ట్రేడయింది. గ్లోబల్ మార్కెట్ (న్యూయార్క్)లో ఔన్స్ బంగారం 1834.90 డాలర్లు పలికింది. గత నెల ఐదో తేదీ ఫ్యూచర్స్ మార్కెట్లో 128 డాలర్లు తగ్గిపోయింది.

Leave A Reply

Your email address will not be published.