మృత్యువు సమీపించిన బెదరని మాతృత్వం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తల్లి బిడ్డ కొరకు ఎలాంటి పరిస్థితిని అయినా ఎదిరిస్తుంది.. ఎవరితోనైనా పోరాడుతుంది అనే అర్థాన్ని ఇచ్చే ఆ మాటలు అక్షర సత్యాలు. పిల్లల కోసం తల్లి ఎంతటి సాహసానికైనా ఒడిగడుతుంది. అవసరమైతే తన ప్రాణాలను కూడా లెక్కచేయదు. కన్న బిడ్డలను రక్షించుకునేందుకు మృత్యువు పై నుంచి వెళ్తున్నా కూడా పట్టించుకోలేదు ఓ తల్లి. చివరికి అందరూ క్షేమంగా బయటపడ్డారు. అసలేం జరిగిందంటే.. అది బీహార్‌ రాష్ట్రం దానాపూర్ రైల్వే డివిజన్‌లోని బార్హ్ రైల్వే స్టేషన్‌. ఢిల్లీకి వెళ్లేందుకు ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఆ రైల్వే స్టేషన్ శనివారం కు వచ్చింది. కొంత సమయం తరువాత భాగల్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్లే విక్రమశిలా ఎక్స్‌ప్రెస్‌ ప్లాట్ ఫారమ్ పైకి చేరుకుంది. అయితే అందులో ఎక్కేందుకు ఒక్కసారిగా స్టేషన్ లో ఉన్న జనమంతా ఎగబడ్డారు. ఆ తల్లి కూడా తన ఇద్దరు చిన్నారులను తీసుకొని రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది.  ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఇద్దరు పిల్లలు సహా ఆమె ప్లాట్ ఫారమ్ పై, రైలు పట్టాల మధ్య పడిపోయింది. అదే సమయంలో రైలు కదలడం ప్రారంభించింది. దీనిని తల్లి గమనించింది. పిల్లలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో వారిని దగ్గరకు లాక్కుంది. వారిపై పడుకొని రైలు తాకకుండా, పట్టాల మధ్యకు పిల్లలు వెళ్లకుండా ఒదిగిపట్టుకుంది. ఆమెపై కొన్ని అంగులాల దూరం నుంచే రైలు వేగంగా వెళ్లడం ప్రారంభించింది. పై నుంచి మృత్యువు వెళ్తున్నా.. కొంచెం కూడా కదలకుండా పెద్ద సాహసం చేసింది.

Leave A Reply

Your email address will not be published.