నాటో లో చిరిన ఫిన్లాండ్ పుతిన్ గుండెల్లో పరుగులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన రష్యా.. అటు యూరప్ లో ఇటు ఆసియా ఖండాల్లో కొంత విస్తరించి ఉంటుంది. అంత పెద్ద భూభాగంలో ఆ దేశానికి ఇప్పటివరకు ఎక్కడా ఎదురులేదు. సైనికంగా బలమైన శక్తి కావడమే దీనికి కారణం. ఏడాదిపైగా ఉక్రెయిన్ మీద దాడులు చేస్తున్నా.. ఆంక్షలు విధించి సంబరపడడం తప్ప రష్యాను ఏ దేశమూ ఏమీ చేయలేకపోతోంది. కానీ ఇకపై ఏదైనా దుందుడుకు చర్య తీసుకుంటే మాత్రం పర్యవసానాలు తీవ్రంగా ఉండనున్నాయి. దీనికి కారణం ఏమంటే..రష్యాకు భయపడి..

నార్వే ఫిన్లాండ్ స్వీడన్.. స్కాండినేవియన్ దేశాల్లో కీలకమైనవి. ప్రపంచంలోనే అత్యంత సంతోషకర దేశంగా దీనికి పేరు. ప్రశాంతతకు మారుపేరు. అలాంటి దేశం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో వణికిపోయింది. మున్ముందు తామెక్కడ బలైపోతామో అన్న ఆందోళనకు గురైంది. అజాతశత్రువులమైన తమకు ముప్పు ఏముంటుందిలే అంటూ కొన్ని వందల ఏళ్లుగా ఏ సైనిక కూటమిలోనూ చేరకుండా ఉన్న ఫిన్లాండ్ ఇప్పుడు మాత్రం ఏకంగా నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ (నాటో)లో చేరిపోయింది. అత్యంత శక్తిమంతమైన ఈ కూటమిలోకి ఫిన్లాండ్ చేరడం అంటే ఓ విధంగా.. మున్ముందు తలెత్తే ఉద్రిక్తతలు ‘ప్రపంచ యుద్ధం” గానూ మారొచ్చు.

ఫిన్లాండ్ – రష్యా మధ్య అతిపెద్ద సరిహద్దు

ఫిన్లాండ్ – రష్యా మధ్య సరిహద్దు 1340 కి.మీ. విశేషమేమంటే.. ఉక్రెయిన్ సహా యూరప్ లోని ఏ దేశానికీ రష్యాతో ఇంత భారీ సరిహద్దు లేదు. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఇదే ఫిన్లాండ్ ఆందోళనకు కారణమవుతోంది. దీంతోనే హడావుడిగా నాటోలో చేరిపోయింది.  కాగా ఈ కూటమిలో చేరిన 31వ దేశం ఫిన్లాండ్. ఈ దేశం చేరికను మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ చేరిక పత్రాలను ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి హావిస్టో మంగళవారం అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ ను ఇచ్చారు.

ఫిన్లాండ్ చేరికను దీనికి కొద్దిగా ముందు బ్లింకెన్ ధ్రువీకరించారు. ఫిన్లాండ్ నాటో సభ్యత్వ పత్రాలను అమెరికా విదేశాంగ శాఖ భద్రపరుస్తుంటుంది. కాగా నాటోలో ఫిన్లాండ్ చేరికను ఇన్నాళ్లుగా టర్కీ వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు చివరగా ఆ దేశమే ఆమోదం తెలిపింది. నాటోలో కొత్తగా ఏ దేశమైనా చేరాలంటే కూటమిలోని మిగతా అన్ని దేశాలు అంగీకరించాల్సి ఉంటుంది.

పుతిన్ కు చెంపపెట్టు

14 నెలలుగా ఉక్రెయిన్ ను ఊపిరిసలపకుండా చేస్తోంది రష్యా. నాటో బూచిని చూపుతూ ఆ దేశంపై దాడి చేస్తోంది. ఇప్పుడు ఏకంగా 1300 కి.మీ. సరిహద్దు ఉన్న ఫిన్లాండే నాటో సభ్య దేశమైంది. ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ కు చెంపపెట్టే.

నాటోలో చేరితే ఏమవుద్ది?

ఏ దేశమైనా నాటో సభ్యదేశమైతే.. ఆ దేశంపై వేరొక దేశం దాడి చేస్తే నాటో కూటమిలోని సభ్య దేశాలన్నీ కలిపి యుద్ధం చేస్తాయి. ఉదాహరణకు ఫిన్లాండ్ పై రష్యా దాడికి దిగితే అది పరోక్షంగా నాటో కూటమిపై దిగినట్లే. అంటే.. ఫిన్లాండ్ సరిహద్దు ఇప్పుడు నాటో చేతుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నట్లు రష్యా తెలిపింది. నాటో విస్తరణ తమ దేశానికి ఇబ్బందికరమేనని పేర్కొంది. తాజా చర్య తమను ప్రతీకారం చర్యకు ప్రేరేపిస్తున్నదని వ్యాఖ్యానించింది. నాటో గనక ఫిన్లాండ్ లోకి అదనపు బలగాలు లేదా ఆయుధాలను పంపితే ఆ దేశ సరిహద్దుల్లో తమ బలగాలను బలోపేతం చేస్తామని హెచ్చరించింది. కాగా ఇప్పటికైతే ఫిన్లాండ్ – రష్యా మధ్య భూభాగానికి సంబంధించి గొడవలు లేవు.

Leave A Reply

Your email address will not be published.