వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మధ్యప్రదేశ్ కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. భోపాల్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌లోని బ్యాటరీ బాక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన ట్రైన్ నుంచి దిగిపోయారు. వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.సోమవారం ఉదయం వందే భారత్‌ రైలు భోపాల్‌ నుంచి ఢిల్లీ బయలు దేరింది. రైలు కుర్వాయి స్టేషన్ వద్దకు రాగానే బ్యాటరీ నుంచి మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే సమాచారాన్ని లోకో పైలట్‌కు అందించారు. దీంతో రైలును అక్కడే నిలిపివేశారు. ఈ క్రమంలో అగ్నిమాపక దళం అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అర్పివేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని.. ఎలాంటి గాయాలు కాలేదని ఇండియన్ రైల్వే ప్రకటించింది.

Leave A Reply

Your email address will not be published.