సిక్కింని ముంచెత్తిన ఆకస్మిక వరదలు.. 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు

తెలంగాణా జ్యోతి/వెబ్ న్యూస్: ఈశాన్య రాష్ట్రం సిక్కిం ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. గత రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ఉత్తర సిక్కింలోని లాచెన్‌ లోయలో గల తీస్తా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వరదలు సంభవించాయి. ఈ వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. వారి కోసం గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సు ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో తీస్తా నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. అదే సమయంలో చుంగ్‌థాంగ్‌ డ్యామ్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో పరిస్థితి తీవ్రతరమైంది. దిగువ ప్రాంతంలో నీటిమట్టం 20 అడుగుల మేర పెరిగింది. దీంతో అకస్మాత్తుగా క్లౌడ్ బరస్ట్ వల్ల వరదలు వెల్లువెత్తాయి.సింగ్టామ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇందులో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆకస్మిక వరదల వల్ల లాచెన్ లోయ వెంబడి ఉన్న అనేక ఆర్మీ స్థావరాలకు కూడా భారీ నష్టం వాటిల్లింది. నది పొంగి ప్రవహించడంతో తీస్తా నదిపై ఉన్న సింథమ్ ఫుట్ బ్రిడ్జి కూలిపోయింది.ఆకస్మిక వరదలతో రాష్ట్రంలోని చాలా రోడ్లు, వంతెనలు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన సిక్కిం ప్రభుత్వం బుధవారం రాష్ట్రంలో హై అలర్ట్‌ ప్రకటించింది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీస్తా నది సమీప ప్రాంతానికి వెళ్లొద్దని హెచ్చరించింది. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది

Leave A Reply

Your email address will not be published.