మ‌హిళ న‌గ్న శ‌రీరంపై బొమ్మలు వేయ‌డాన్ని అశ్లీలంగా భావించ‌రాదు

- రెహానా ఫాతిమాపై పోక్సో కేసును కొట్టివేసిన కేర‌ళ హై కోర్టు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మ‌హిళా హ‌క్కుల కార్య‌క‌ర్త రెహానా ఫాతిమాపై న‌మోదు అయిన పోక్సో కేసును కేర‌ళ హై కోర్టు కొట్టిపారేసింది. మ‌హిళ న‌గ్న శ‌రీరంపై బొమ్మలు వేయ‌డాన్ని అన్ని సంద‌ర్భాల్లో అశ్లీలంగా, లైంగిక‌మైందిగా భావించ‌రాదు అని కోర్టు తెలిపింది. త‌మ శ‌రీరంపై మ‌హిళ‌లకు ఉన్న స్వేచ్ఛా హ‌క్కును విభేదించ‌లేమ‌ని కోర్టు తెలిపింది. పోక్సోతో పాటు జువెనైల్ జ‌స్టిస్‌, ఐటీ చ‌ట్టాల కింద ఫాతిమాపై గతంలో ఓ కేసు న‌మోదు అయ్యింది. అర్ధ‌న‌గ్నంగా ఉన్న ఆమె త‌న పిల్లల‌తో శ‌రీరంపై పేయింటింగ్ వేయించుకున్న‌ది. అయితే ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో వైర‌ల్ అయ్యింది. దానిపై న‌మోదు అయిన కేసులో కేర‌ళ కోర్టు తీర్పునిచ్చింది.ఈ కేసులో జ‌స్టిస్ కౌస‌ర్ ఎడ‌ప్ప‌గ‌త్ తీర్పుని ఇస్తూ .. 33 ఏళ్ల సామాజిక కార్య‌క‌ర్త ఫాతిమా త‌న లైంగిక తృప్తిని తీర్చుకునేందుకు త‌న పిల్ల‌ల‌ను వాడుకున్న‌ట్లు నిర్ధారించ‌లేమ‌ని అన్నారు. త‌న శ‌రీరాన్ని కేవ‌లం కాన్వాస్ త‌ర‌హాలో వాడుకునేందుకు త‌న పిల్ల‌ల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్లు కోర్టు తెలిపింది. త‌న శ‌రీరాన్ని త‌న‌కు న‌చ్చిన‌ట్టు వాడుకునే స్వేచ్ఛ మ‌హిళ‌కు ఉంద‌ని, అది ప్రాథ‌మిక స‌మాన‌త్వ హ‌క్కు అవుతుంద‌ని, త‌న ప్రైవ‌సీకి సంబంధించిన అంశ‌మ‌ని కోర్టు చెప్పింది. శ‌రీర స్వేచ్ఛ అనేక రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 21 కింద‌కు వ‌స్తుంద‌ని కోర్టు తెలిపింది.పేయింటింగ్ కోసం త‌న శ‌రీర పైభాగాన్ని ఫాతిమా త‌న వీడియోలో చూపించింద‌ని, ఇది అశ్లీలం అవుతుంద‌ని ఈ కేసులో ప్రాసిక్యూష‌న్ వాదించింది. ఆ వాద‌న‌ను జ‌డ్జి కొట్టేశారు. న‌గ్న‌త్వం, అశ్లీలం ఎప్పుడూ ఒక్క‌టి కాదు అని, న‌గ్న‌త్వాన్ని అశ్లీలంగా భావించ‌డం స‌రికాదు అని అన్నారు. దాన్ని అస‌భ్యంగా, అనైతికంగా చూడ‌రాదు అని కోర్టు తెలిపింది. ఒక‌ప్పుడు కేర‌ళ‌కు చెందిన దిగువ జాతి స్త్రీలు త‌మ య‌ద‌ల‌పై వ‌స్త్రాన్ని క‌ప్పుకునేందుకు పోరాటం చేయాల్సి వ‌చ్చింద‌ని, ఎన్నో ఆల‌యాల్లో సెమీ న్యూడ్ విగ్ర‌హాల‌ను మ‌నం చూడ‌వ‌చ్చు అని, అలాంటి ప్ర‌దేశాల‌ను మ‌నం ప‌విత్ర‌మైన‌విగా భావిస్తున్నామ‌ని కోర్టు తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.