మునుగోడుకు ముఖ్యమంత్రి కేసీఆర్

.. మూడు రోజులపాటు అక్కడే బస .. భారీ ఎత్తున బలగాల మోహరింపు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మునుగోడులో ఉపఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. నువ్వానేనా అన్నట్లుగా అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటికే తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో బిజీగా ఉన్నారు.

త్వరలో సీఎం కేసీఆర్ కూడా మునుగోడుకు వెళ్లనున్నారు. తమ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. నవంబరు 3న ఉపఎన్నికల పోలింగ్ జరుగుతుంది. నవంబరు 1నే ప్రచారం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అక్టోబరు 29, 30, 31 రోజుల్లో మునుగోడులో సీఎం కేసీఆర్ పర్యటిస్తారని సమాచారం.

మరోవైపు మునుగోడులో కేంద్ర బలగాలు భారీగా మోహరిస్తున్నాయి. రాష్ట్ర పోలీసులతో కలిసి అన్ని చోట్లా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఐతే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున బలగాలు వస్తుండడంతో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీగా పోలీసులను రంగంలోకి దింపాలని భావిస్తోంది. దీనిపై సీఎస్, డీజీపీతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వారం రోజుల ఢిల్లీ

పర్యటన ముగించుకొని బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్.. ఆ తర్వాత వెంటనే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. హైదరాబాద్ , సైబరాబాద్ కమిషనర్లు కూడా సమావేశానికి హాజరయ్యారు.

మునుగోడులో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న తరహాలోనే హింసాత్మక ఘటనలు జరిగే అవకాశముందని సమాచారం వచ్చిందని.. ఈ అంశాన్ని అధికారులతో సీఎం ప్రస్తావించినట్లు సమాచారం. మునుగోడులో ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబట్టుతుండడంతో.. అక్కడి తాజా పరిస్థితి, పోలీసుల మోహరింపుపై చర్చించారట. ప్రచారంలో వివిధ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు, వాటికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్ ఆరాతీసినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, మునుగోడుకు కేంద్రబలగాలను తరలించాలని గతంలో బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని విజ్ఞి చేసింది. ఈ క్రమంలోనే 30 కంపెనీల పారా మిలటరీ బలగాలను మునుగోడుకు పంపేందుకు ఆమోదం లభించింది. ఇప్పటికే 10 కంపెనీల పారా మిలటరీ బలగాలు మునుగోడులో మోహరించాయి. రెండు మూడు రోజుల్లో మరో 20 కంపెనీల బలగాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీగా పోలీసులను మోహరించాలని భావిస్తోంది. రాష్ట్రానికి చెందిన బెటాలియన్లను మునుగోడులో దింపాలని భావిస్తోంది. ఈ అంశంపైనే నిన్న డీజీపీతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపినట్లు సమాచారం. ఇప్పటికే పలు జిల్లాల నుంచి పోలీసులు మునుగోడుకు తరలి వెళ్లారు. త్వరలోనే అదనపు బలగాలను తరలివెళ్లనున్నాయని సమాచారం.

Leave A Reply

Your email address will not be published.