మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో చుక్కెదరు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌‍కు (KCR) షాక్ తగిలింది. విద్యుత్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్‌లో పేర్కొనగా.. నిబంధనల మేరకే విద్యుత్ కమిషన్ వ్యవహరిస్తోందని ఏజీ తెలిపారు. కేసీఆర్ పిటిషన్‌కు విచారణార్హత లేదని వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఏజీ వాదనలతో ఏకీభవించింది. పిటిషన్ కొట్టేస్తూ.. విద్యుత్ కమిషన్ విచారణ కొనసాగించవచ్చని తెలిపింది.

మార్చి 14న కమిషన్ ఏర్పాటు

బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ ప్రభుత్వం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి నేతృత్వంలో ఈ ఏడాది మార్చి 14న కమిషన్ వేసింది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ – తెలంగాణ మధ్య విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్‌కు విచారణ సంఘం నోటీసులు జారీ చేసింది. దీంతో విద్యుత్ కమిషన్ ఏర్పాటును కేసీఆర్ వ్యతిరేకించారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోళ్లు జరిగాయని.. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని అన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్స్ పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఆ కమిషన్ రద్దు చేయాలని గులాబీ బాస్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం సోమవారం తాజాగా తీర్పు వెలువరించింది. పద్ధతి ప్రకారమే విచారణ జరుగుతోందని.. ట్రాన్స్ కో, జెన్ కో అధికారుల్ని కూడా కమిషన్ విచారించిందని.. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు.

Leave A Reply

Your email address will not be published.