సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డిఎస్పి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉద్యమకారులపై లాఠీ ఝుళిపించలేక తన ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ అధికారిణి నళిని శనివారం నాడు డా. బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని ఇటీవలే జరిగిన పోలీసు శాఖ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి నళిని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంపై నళిని మీడియాతో మాట్లాడుతూ… ‘‘సీఎం రేవంత్ రెడ్డిని కలవడం సంతోషంగా ఉంది. ఉద్యోగం ఇప్పుడు నాకు అవసరం లేదు. డబ్బు, భౌతిక ప్రపంచం నుంచి బయటపడ్డాను… ఇప్పుడు నాది ఆధ్యాత్మిక మార్గం. వేద కేంద్రాలకు ప్రభుత్వ సహకారం అడిగాను.. సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వేదం , యజ్ఞం పుస్తకాలు పూర్తి చేస్తున్నాను. సనాతన ధర్మం ప్రచారానికి పనిచేస్తాను. గతంలో తనతో పాటు ఉన్న ఉద్యోగులు.. డిపార్ట్‌మెంట్‌లో ఎదుర్కొన్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికు రిపోర్ట్ ఇచ్చాను. తనలా ఎవరు బాధ పడవద్దన్నదే నా అభిప్రాయం. నాడు బ్యూరోక్రసీ మీద నమ్మకం పోయింది. అందుకే ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్నాను. నాకు జరిగిన అన్ని విషయాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాను. నా మనస్సుకు నచ్చిన సేవ చేస్తున్నాను. ఇన్నాళ్ల నా మనోవ్యథను ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషంగా ఉంది’’ అని నళిని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.