బీజేపీలోకి మాజీ ఎంపీ పొంగులేటి?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేసీఆర్ పై గుర్రుగా ఉన్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) బీఆర్ఎస్ గుడ్ బై చెప్పబోతున్నారా? త్వరలోనే పొంగులేటి బీజేపీ కండువా కప్పుకోనున్నారా? ఇందుకోసం రంగం సిద్దమైందా అని అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ గూటికి పొంగులేటి చేరిక దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. ఇక పార్టీ మార్పుకు అనుగుణంగా పొంగులేటి అడుగులు పడుతున్నాయి. ఈనెల 10న నియోజకవర్గ అనుచరులతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  (Ponguleti Srinivas Reddy) భేటీ అవ్వనున్నట్టు తెలుస్తుంది. ఆ తరువాత ఈనెల 18న కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది.

కాగా ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి  (Ponguleti Srinivas Reddy) భద్రతను తగ్గించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం ఆయనకు ఇస్తున్న 3+3 భద్రతను 2+2కు తగ్గించింది. అంతేకాదు ఇప్పటివరకు ఆయనకు కొనసాగిస్తున్న ఎస్కార్ట్ వాహనాన్ని కూడా తొలగించింది. ఉన్నట్టుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం తన అనుచరులతో సమావేశం నిర్వహించిన పొంగులేటి.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని చెప్పారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానని ఇప్పుడే చెప్పలేనని వ్యాఖ్యానించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. బీఆర్ఎస్‌లో(BRS) తనకు లభించింది ఏమిటన్నది అందరూ చూస్తూనే ఉన్నారని చెప్పారు.

మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని డిసైడయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఖమ్మం , కొత్తగూడెం, పాలేరులోని ఏదో స్థానం నుంచి పోటీ చేస్తానని కుండబద్ధలు కొట్టారు. అయితే ఆయన కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు లేదా వామపక్షాలు, ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్ బరిలో ఉండటంతో.. ఆయనకు మిగిలింది కొత్తగూడెం ఒక్కటేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ మారి తాను అనుకున్న స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

 

Leave A Reply

Your email address will not be published.