బక్రీద్ సందర్భంగా గొర్రెలకు ఫుల్ డిమాండ్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బక్రీద్ పండుగను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా గొర్రెలు, మేకలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా జీవాలు భారీగా ధర పలుకుతున్నాయి. కొన్ని చోట్ల మేకలు, గొర్రెలను వేలం వేసి మరీ విక్రయిస్తున్నారు.మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ‘టొరంటో’ అనే పేరున్న రెండేళ్ల గొర్రెను వేలం వేయగా కళ్లు చెదిరే ధర పలికింది. భారీ బరువు ఉన్న టొరంటోను వేలం వేసి రూ.7.5 లక్షలకు విక్రయించారు. అయితే ఈ గొర్రెను మే నెలలో వేలం వేసినట్టు నవభారత్ టైమ్స్ కథనం పేర్కొంది. 161 కిలోల బరువున్న ఈ గొర్రెను పుణేకి చెందిన ఓ వ్యాపారి రూ.7.5 లక్షలకు కొనుగోలు చేశారని నవభారత్ టైమ్స్ మే 21న కథనాన్ని ప్రచురించింది.
భోపాల్‌లోనే వేసిన వేలంలో కశ్మీరీ బ్రీడ్‌కు చెందిన తుఫాన్ అనే 40 కిలోల బరువున్న గొర్రెను వేలం వేయగా రూ.7 లక్షలు పలికిందట. ప్రత్యేకమైన ఈ గొర్రెలను ప్రదర్శనలో వేలానికి ఉంచగా.. అవన్నీ అమ్ముడుపోవడం గమనార్హం. రాఫ్తార్ అనే గొర్రె 141 కిలోలు ఉండగా.. నూరా అనే గొర్రె 145 కిలోలు ఉందట.

ఢిల్లీలోని జామా మసీద్ సమీపంలో ఉండే మీనా బజార్‌లోనూ భారీ ఎత్తున గొర్రెలను విక్రయిస్తుంటారు. ఇక్కడ జరిగే బకరా మేళాలో పెద్ద సంఖ్యలో జనం పాల్గొంటారు. ఇక్కడ విక్రయించే గొర్రెలు వాటి బరువు, బ్రీడ్‌ను బట్టి రూ.25 వేల నుంచి రూ.2 లక్షల వరకు పలుకుతాయి. కానీ కొన్ని పత్ర్యేక గొర్రెలు మాత్రం ఈసారి రూ.10 లక్షల వరకు పలుకుతాయని అంచనా వేస్తున్నారు. రూ.25 వేల నుంచి రూ.40 వేల మధ్య ధర పలికే గొర్రెలు ఈ బకరా మేళాలో వేగంగా అమ్ముడుపోతాయి. లక్షకుపైగా ధర పలికే గొర్రెల విక్రయానికి మాత్రం ఒకింత సమయం పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు.

మరోవైపు హైదరాబాద్‌లోనూ బక్రీద్ సందడి కనిపిస్తోంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలతోపాటు పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి బక్రీద్ కోసమని ప్రత్యేకంగా గొర్రెలు, మేకలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. జియాగుడ మార్కెట్‌లో మామూలు రోజుల్లో వంద మంది వ్యాపారులు గొర్రెల క్రయవిక్రయాలు సాగిస్తారు. కానీ బక్రీద్ సందర్భంగా దాదాపు 300 మంది వ్యాపారులు గొర్రెల క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. బక్రీద్ సందర్భంగా 11 నుంచి 14 కిలోల బరువు తూగే గొర్రెలను ఖుర్బానీ కోసం ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో 12 కిలోల బరువుండే గొర్రె రూ.12 వేలు పలుకుతోందట.

Leave A Reply

Your email address will not be published.