ఉగాది ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

- సీఎస్ శాంతికుమారి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: ఈ నెల 22న రవీంద్రభారతిలో నిర్వహించనున్న “ శోభకృత నామ సంవత్సరం (ఉగాది) ” ఉత్సవాల సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఉగాది పండుగ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై ఆమె అధికారులతో సమీక్షించారు. బిఆర్ కెఆర్ భవన్ లో ఈ రోజు జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కె.వి రమణాచారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.వేదపండితులు, అవార్డు గ్రహీతలు ఈ కార్యక్రమంలో పాల్గొనుటకు తగు రవాణా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. వేదిక, వేదిక అలంకరణ, ఆహ్వాన పత్రాల ముద్రణ, సీటింగ్‌ ఏర్పాట్లు, సాయంత్రం కవి సమ్మేళనం కోసం సాంస్కృతిక శాఖ తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. వేదిక వద్ద తాగునీటి సరఫరా, అదేవిధంగా నిరంతర విద్యుత్‌ సరఫరా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన భద్రత కల్పించాలని, పార్కింగ్‌ ప్లాన్‌ను సిద్ధం చేయాలని పోలీసు శాఖను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. అలాగే ఈ నెల 21, 22 తేదీల్లో ప్రభుత్వ ప్రధాన భవనాల్లో సూచికల ఏర్పాటు, విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఉగాది తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో అధికారులందరూ సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొనాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, టూరిజం, సాంస్కృతిక శాఖ మఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, GAD కార్యదర్శి శేషాద్రి, TR&B కార్యదర్శి శ్రీనివాసరాజు, MD, HMWS&SB దాన కిషోర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ C.V ఆనంద్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, DG ఫైర్ సర్వీసెస్ వై.నాగిరెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఎం.హరికృష్ణ ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.