గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ

-   ఈ నెల 20వ తేదీలోగా గృహలక్ష్మి పథకం మొదటిదశ దరఖాస్తుల పరిశీలన  -  మహిళల పేరిటే గృహలక్ష్మి పథకం మంజూరవుతుంది -   దరఖాస్తుదారులు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి - మంత్రి వేముల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయని.. వాటిని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఖాళీ స్థలం ఉన్న ఎవరైనా సరే గృహలక్ష్మి కింద దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుదారులు తమ ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తులు పంపించవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లు పూర్తయితే.. రెండో దశలో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఇల్లు లేని పేదలు ఆందోళన చెందవద్దని.. దశలవారీగా ఇంటి నిర్మాణాల కోసమే ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు.ఈ నెల 20వ తేదీలోగా గృహలక్ష్మి పథకం మొదటిదశ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. 10వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులకు మొదటి విడతలో అవకాశం కల్పిస్తారు. పదో తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులను రెండోవిడతలో పరిశీలించాలని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపికచేస్తారు. జిల్లా మంత్రి ఆమోదంతో లబ్ధిదారుల జాబితాను సిద్ధంచేస్తారు. కొన్ని జిల్లాల్లో 15వ తేదీలోగా దరఖాస్తుల ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతుండగా, ఇందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

అర్హతలుమార్గదర్శకాలు

☛ మహిళల పేరిటే గృహలక్ష్మి పథకం మంజూరవుతుంది.

☛ దరఖాస్తుదారులు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి.

☛ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా స్థానికులై ఉండాలి.

☛ ఆధార్‌ లేదా ఓటరు గుర్తింపు కార్డులు కలిగి ఉండాలి.

☛ ఇంటి నిర్మాణానికి ఖాళీ స్థలం ఉండాలి.

☛ లబ్ధిదారుడు లేదా ఆ కుటుంబసభ్యుల పేరిట ఆహార భద్రత కార్డు ఉండాలి.

☛ దరఖాస్తుదారుడు దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి.

☛ బ్యాంకులో ప్రత్యేక ఖాతా తెరవాలి. తప్పనిసరిగా ప్రభుత్వ బ్యాంకు ఖాతానే ఉండాలి.

☛ జన్‌ధన్‌ ఖాతాను ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించరాదు.

☛ ఇప్పటికే ఆర్సీసీ చెత్తుతో ఇల్లు ఉన్నా,జీవో 59కింద లబ్ధిపొందినా ఈ పథకం వర్తించదు.

Leave A Reply

Your email address will not be published.