చాప కింద నీరులా విస్తరిస్తున్న గుడుంబా

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్ :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లో గుడుంబా తయారీ చాపకింద నీరులా విస్తరించి ఉంది. ఏజెన్సీ గ్రామాల్లో నాటు సారా ఏరులై పారుతున్నా అధికారులు ఎవరు అటువైపు చూడడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని బూర్గంపాడు, సారపాక, అంజనాపురం, సోంపల్లి, భద్రాచలం మండలంలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల ఇలా దాదాపు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో గుడుంబా గుప్పుమంటుంది. అధికారుల తనిఖీలు లేకపోవడంతో గుడుంబా వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుంది. పేద కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న ఈ నాటు సారాకు కళ్లెం వేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గుడుంబా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

ఎక్సైజ్ అధికారులు నామమాత్రపు దాడులకే పరిమితమయ్యారని స్థానిక మహిళలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. నెలవారి మామూళ్లకు అలవాటు పడిన కొంతమంది సిబ్బంది ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో దాడులు జరిగే సమయంలో గుడుంబా తయారీదారులకు ముందస్తు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం వల్లనే తయారీదారులు తప్పించుకుంటున్నారనేది స్థానికంగా వినిపిస్తున్న మాట. చిన్నపాటి కుటీర పరిశ్రమను తలపిస్తున్న గుడుంబా తయారీ భద్రాద్రి జిల్లాలో చాప కింద నీరుల తిరిగి వ్యాప్తి చెందుతుందనడంలో సందేహం లేదు. ప్రధానంగా గుడుంబా కేంద్రాలను అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు ముడి సరుకును సైతం అరికట్టాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో గుడుంబా తయారీకి ఉపయోగించే నల్ల బెల్లం విక్రయదారుల నుంచి లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుని నల్ల బెల్లం విక్రయాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.