కట్నం కోసం వదినకు వేధింపులు.. నటి అభినయకు రెండేళ్ల జైలు శిక్ష

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బెంగళూరు: బెంగళూరు (మల్లేశ్వరం): కట్నం కోసం తన వదినను వేధించిన ఆరోపణలు రుజువు కావడంతో సీనియరు నటి అభినయకు రెండేళ్ల కారాగార శిక్షను ఖరారు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆమె సోదరుడు శ్రీనివాస్‌కు మూడేళ్లు, ఆమె తల్లి జయమ్మకు ఐదేళ్లు, మరో సోదరుడు చెలువరాజుకు రెండేళ్ల శిక్షను విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌.బి.ప్రభాకరశాస్త్రి బుధవారం తీర్పు ఇచ్చారు.

శ్రీనివాస్‌ భార్య లక్ష్మీదేవిని వేధించిన ఆరోపణలకు సంబంధించిన కేసును బెంగళూరు నగర జిల్లా న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ లక్ష్మీదేవి హైకోర్టును ఆశ్రయించారు. శ్రీనివాస్‌, లక్ష్మీదేవిల వివాహం 1998లో జరిగింది. వివాహ సమయంలో లాంఛనాల రూపంలో రూ.80 వేల నగదు, 250 గ్రాముల ఆభరణాలు తీసుకున్నారు. ఆ తర్వాత మరో రూ.లక్ష తీసుకు రావాలని అభినయ తనను శారీరకంగా, మానసికంగా వేధించారని ఆరోపిస్తూ ఆమె 2002లో చంద్రా లేఅవుట్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

వివాహమైన ఆరు నెలల నుంచే తనను అత్తింటి కుటుంబ సభ్యులు వేధించారని ఆమె అప్పుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. హైకోర్టు తీర్పు పట్ల లక్ష్మీదేవి హర్షం వ్యక్తం చేశారు. అత్తింట్లో పలు అవమానాలను ఎదుర్కొన్నానని వాపోయారు. అభినయ అప్పుడు కథానాయిక కావడంతో ఇంటికి ఎవరెవరో వచ్చే వారని, వారికి సహకరించాలని తనపై ఒత్తిడి చేసేవారని తెలిపారు. రెండు దశాబ్దాల అనంతరం తనకు న్యాయం దక్కిందని సంతృప్తి వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.