జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందా?        

- రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ఉత్త నాటకమేనా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందా? మూడు నాలుగు నెలల ముందే ఈ అంశంపై పని ప్రారంభించిందా? రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ఉత్త నాటకమేనా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. కొన్ని నెలలుగా బీజేపీ సీనియర్లతోపాటు కమిటీ అధ్యక్షుడు, మాజీ రాష్ట్రపతి కదలికలను గమనిస్తే దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కారు ఎప్పుడో నిర్ణయించుకొన్నదని అర్థమవుతుంది. ఏదో చట్టబద్ధంగా, పద్ధతి ప్రకారం వ్యవహరిస్తున్నామని ప్రజలకు చెప్పేందుకే కమిటీ పేరుతో నాటకం మొదలుపెట్టిందని తెలుస్తున్నది.

మూడు నెలల ముందు నుంచే

జమిలి ఎన్నికలపై వారం క్రితం కేంద్రం చర్చకు తెరలేపింది. కానీ, దీనిపై అన్నిరకాల వ్యూహాలు సిద్ధం చేసుకొన్న తర్వాతే లీకులు ఇచ్చిందని పలు మీడియా రిపోర్టులు, పలువురు రాజకీయ విశ్లేషకుల మాటలనుబట్టి అర్థమవుతున్నది. జమిలి ఎన్నికలపై కమిటీ వేయబోతున్నట్టు, ఆ కమిటీకి రామ్‌నాథ్‌ కోవింద్‌ను చైర్మన్‌గా నియమించబోతున్నట్టు ఆయనకు మూడు నెలల ముందే కేంద్రం సమాచారం ఇచ్చినట్టు తెలుస్తున్నది. అప్పటి నుంచి ఆయన పలు రాష్ర్టాల గవర్నర్లను కలువటం, ఆయనను పలువురు బీజేపీ, ఆరెస్సెస్‌ నేతలు కలిసిన విషయాన్ని జాతీయ మీడియా బయటపెట్టింది. అంటే కేంద్రం పక్కా ప్రణాళిక ప్రకారం అన్నీ సిద్ధం చేసుకొన్న తర్వాతే కమిటీ వేసిందని స్పష్టమవుతున్నది.

పూర్వరంగం సిద్ధం చేసిన కోవింద్‌

జమిలి ఎన్నికలపై వేసిన కమిటీ అధ్యక్షుడు రామ్‌నాథ్‌ కోవింద్‌.. ఈ అంశంపై ఇప్పటికే పూర్వరంగం సిద్ధం చేసినట్టు గత జూన్‌ నుంచి ఆయన కార్యకలాపాలను బట్టి తెలుస్తున్నది. జూన్‌ 9 నుంచి ఆయన పలు రాష్ర్టాల గవర్నర్లతో వరుసగా సమావేశమవుతూ వస్తున్నారు. ప్రస్తుతం అన్ని రాష్ర్టాల గవర్నర్లూ మోదీ సర్కారు నియమించినవారే. చాలా రాష్ర్టాల గవర్నర్లు కేంద్రానికి సామంతుల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. వీరిలో చాలామందిని కోవింద్‌ గత మూడు నెలల్లో కలువటం ఆసక్తి కలిగిస్తున్నది. ఆగస్టు 31న చివరగా బీజేపీ మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌తో కోవింద్‌ సమావేశమయ్యారు. దీంతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ జమిలి ఎన్నికలకు ఎప్పుడో ముహూర్తం ఖరారు చేశాయని, పరిస్థితులను పూర్తిగా బీజేపీకి అనుకూలంగా మార్చే పనిని రామ్‌నాథ్‌ కోవింద్‌కు అప్పగించాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పూర్వరంగం మొత్తం సిద్ధమైన తర్వాతే కేంద్రం కమిటీ వేసిందని అనుమానిస్తున్నారు.

బీజేపీ రాష్ర్టాల్లో ప్రభుత్వాల రద్దు?

జమిలి ఎన్నికలపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీకి కేంద్ర ప్రభుత్వం సూచించింది. అంటే.. మరో 15 రోజుల్లో నిర్వహించే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలోపే ఈ కమిటీ నివేదిక ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే జరిగితే జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో పెట్టే అవకాశం ఉన్నది. ఆ వెంటనే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అసెంబ్లీలను రద్దుచేయవచ్చని భావిస్తున్నారు. అలా ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చి ఇతర రాష్ర్టాల్లో కూడా అసెంబ్లీను రద్దు చేయించే ఎత్తుగడ బీజేపీ వేస్తున్నదని విశ్లేషిస్తున్నారు. అందుకే రాష్ర్టాల గవర్నర్లతో రామ్‌నాథ్‌ కోవింద్‌ మూడు నెలలనుంచి వరుస భేటీలు నిర్వహించారని చెప్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.