సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకున్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కాళ్లకు ఆయన మొక్కడం ప్రస్తుతం కాంట్రవర్సీగా మారింది. ప్రగతిభవన్ ఈ వివాదానికి వేదికైంది. ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా ఉండి కేసీఆర్ కాళ్లు మొక్కడంపై రాజకీయ నేతల నుంచి విమర్శలు వినిపిస్తోన్నాయి. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ కోసమే ఆయన ఇలా చేశారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది.. సీఎం కేసీఆర్ కాళ్లకు శ్రీనివాసరావు మొక్కిన సన్నివేశాన్ని కొంతమంది చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారడంతో పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆ వీడియోపై మండిపడ్డారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో వీడియోను షేర్ చేసిన ఆకునూరి మురళి.. శ్రీనివాసరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కొత్తగూడెం అసెంబ్లీ టీఆర్ఎస్ టికెట్ గురించే కదా డాక్టర్ శ్రీనివాస్ సీఎం కాళ్లు పట్టుకోవడం. మీలాంటి అధికారులు బ్యూరోక్రసీ పరువు తీస్తున్నారు. మొన్న కొత్తగూడెం వెళ్ళినప్పుడు చూసా టౌన్ నిండా మీ ఫ్లెక్సీలే. పదవిని దుర్వినియోగం చేస్తూ కొత్తగూడెంలో ఏదో కార్యక్రమాలు చేస్తున్నారని కొందరు నాతో అన్నారు’ అంటూ మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సీరియస్ అయ్యారు.మంగళవారం రాష్ట్రంలో 8 కొత్త మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రగతిభవన్ నుంచి వర్చువల్ ద్వారా మెడికల్ కాలేజీల్లో క్లాసులను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సమయంలో సీఎం కేసీఆర్ కాళ్లకు శ్రీనివాసరావు మొక్కారు. దీంతో టీఆర్ఎస్ టికెట్ కోసమే కేసీఆర్ కాళ్లకు మొక్కారంటూ ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. గతంలో సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న సమయంలో కేసీఆర్ కాళ్లకు వెంకట్రామిరెడ్డి మొక్కడం కలకలం రేపింది. దీనిపై రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలొచ్చాయి. ఆ తర్వాత వెంకట్రామిరెడ్డి టీఆర్ఎస్‌లో చేరడం, ఆయన ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవడం జరిగాయి. ఆ తర్వాత ఇంకో సందర్భంలో కామారెడ్డి కలెక్టర్ శరత్ కేసీఆర్ కాళ్లు మొక్కారు.ఇప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారి అయిన శ్రీనివాసరావు.. సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడంపై దుమారం చెలరేగుతోంది. అందరి ముందు కాళ్లకు మొక్కడంపై విమర్శలు వస్తోన్నాయి. దీనిపై పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులతో పాటు సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ కోసమే ఇలా చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, రాజకీయ వర్గాల్లో ఈ వీడియోపై జోరుగా చర్చ జరుగుతోంది.

Leave A Reply

Your email address will not be published.