హృదయ విదారకం.. అర్థరాత్రి నడిరోడ్డుపై మహిళ ప్రసవం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామానికి చెందిన యాదమ్మ నిండు గర్భిణి. ఈ నెల 2న తన మూడేళ్ల కుమారుడితో కలిసి వైద్య పరీక్షల కోసం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కమ్యూనిటీ ఆసుపత్రికి చికిత్స వచ్చింది. అయితే తమ బ్యాగుల్లో నగదు చోరీ చేసిందంటూ ఆస్పత్రి సిబ్బంది ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొద్దిరోజులుగా జడ్చర్ల పట్టణంలోనే తిరుగుతూ గాంధీ చౌక్‌లోని ఓ రేకుల షెడ్డు కింద తలదాచుకుంటోంది.

గత అర్ధరాత్రి దాటిన తర్వాత యాదమ్మకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. సమీపంలో ఎవరూ లేకపోవడంతో బాధనంతా పంటి బిగువున భరిస్తూ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సమీపంలోని ఓ షాపు యజమాని ఆమె పరిస్థితి చూసి చలించిపోయాడు. మరికొందరి సాయంతో ఆమెను ఆటోలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. ప్రభుత్వ ఆసుపత్రికి కూత వేటు దూరంలో ఉన్న గాంధీ కూడలిలో ఓ మహిళ ఇలాంటి హృదయ విదారమైన స్థితిలో ఓ బిడ్డకు జన్మనివ్వడం పట్ల వైద్యుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు 20 రోజుల క్రితం యాదమ్మ ఆసుపత్రిలో చోరీ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని, దీంతో యాదమ్మ భయపడి తాను ప్రసవం కోసం ఆసుపత్రికి రాలేదని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ప్రసవించిన తర్వాత స్థానికుల సాయంతో ఆస్పత్రికి వచ్చిన ఆమెకు అన్ని సపర్యలు చేసి మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెబుతున్నారు. గాంధీ విగ్రహం సాక్షిగా జరిగిన ఈ విషాదకర ఘటన జడ్చర్ల పట్టణవాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు అక్కడక్కడా జరిగాయి.

అట్టముక్కలు అడ్డుపెట్టి..
సంగారెడ్డిలో రెండు రోజుల క్రితం ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. నడి రోడ్డు మీదే ఓ గర్భిణీ ప్రసవించింది. నరకయాతన అనుభవిస్తూ పండంటి మగబిడ్డకు జన్మించింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో నెలలు నిండిన ఓ గర్భిణీ బబిత జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఒక్కసారిగా పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. తట్టుకోలేనంత తీవ్రతతో నొప్పులు రావటంతో ఆ గర్భిణీ అక్కడే కూలబడిపోయింది. నడిరోడ్డుపై నొప్పులతో నరకయాతన అనుభవించింది. అక్కడే ఉన్న దుకాణాదారులు ఆమెను గమనించారు. ఆమెను ఆస్పత్రికి గానీ పక్కకు గానీ తీసుకెళ్లే పరిస్థితి దాటిపోయింది. ఇక చేసేదేమీలేక వ్యాపారస్థులంతా కలిసి ఆమె చుట్టూ అట్ట ముక్కలు పెట్టి ఆమెకు పురుడు పోశారు. ఆ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనలో తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇద్దరినీ పురుడు అనంతరం వెంటనే పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రికి ఆటోలో తరలించి చికిత్స అందించారు.

Leave A Reply

Your email address will not be published.