నేడు, రేపు ఢిల్లీలో భారీ వర్షాలు

తెలంగాణా జ్యోతి వెబ్ న్యూస్: నిన్న కురిసిన భారీ వర్షానికే తేరుకోని ఢిల్లీ వాసులకు భారత వాతావరణ శాఖ (India Meteorological Department) పిడుగులాంటి వార్త చెప్పింది. ఈ వారాంతంలో దేశ రాజధాని అంతటా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం (Delhi Rain) ఉందని వెల్లడించింది. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ‘జూన్‌ 29, 30 తేదీల్లో ఢిల్లీ అంతటా కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Very Heavy Rain) కురిసే అవకాశం ఉంది’ అని పేర్కొంది.

.. చిగురుటాకులా వణికిపోయిన ఢిల్లీ

గత మూడు నెలలుగా ఎండ తీవ్రతతో అల్లాడిపోయిన దేశరాజధాని ఢిల్లీ నగరం.. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి చిగురుటాకులా వణికిపోయింది. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు మొదలైన వాన ఏకధాటిగా మూడు గంటలకు పైగా కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాలు నీట మునిగాయి. అనేక ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. ఈ వర్షంతో రాజధాని మొత్తం జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. 24 గంటల్లో ఢిల్లీలో 228.1 ఎంఎం వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా ఢిల్లీలో జూన్‌ నెల మొత్తం కలిపి సగటున 74.1 ఎంఎం వర్షపాతం నమోదవుతుంది. మూడు నెలల్లో కురవాల్సిన వర్షం కంటే ఎక్కువ కేవలం 24 గంటలల్లోనే పడింది. 1936 తర్వాత జూన్‌లో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది ఇప్పుడేనని వాతావరణ శాఖ వెల్లడించింది.

 

ఎంపీల ఇండ్లలోకి చేరిన నీరు

భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని ఎంపీలు, మంత్రుల ఇండ్లలోకి కూడా నీరు చేరింది. లోధి ఎస్టేట్‌ ప్రాంతంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్‌ యాదవ్‌ ఇంటి ముందు రోడ్డుపై మోకాళ్ల లోతు నీరు నిలవడంతో ఆయనను భుజాలపై ఎత్తుకొని కారు ఎక్కించారు. కాగా, తాను నిద్ర లేచే సరికి తన ఇంట్లోకి అడుగు ఎత్తులో నీరు చేరిందని, ఫర్నీచర్‌, వస్తువులన్నీ తడిచిపోయాయని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ఇటీవల నీటి కొరతతో నిరాహార దీక్షకు దిగిన ఢిల్లీ మంత్రి అతిశీ ఇల్లు కూడా నీట మునిగింది. అసాధారణ రీతిలో భారీ వర్షం కురవడంతో ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఢిల్లీలో మొత్తం వర్షాకాలం కలిపి 800 ఎంఎం వర్షం పడాల్సి ఉండగా, 24 గంటల్లోనే ఇందులో 25 శాతం(228 ఎంఎం) వర్షం కురవడం వల్ల సమస్యలు తలెత్తాయని మంత్రి అతిశీ పేర్కొన్నారు.

….     ఢిల్లీకి చేరుకున్న నైరుతీ

నైరుతీ రుత‌ప‌వ‌నాలు ఢిల్లీకి చేరుకున్నట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ పేర్కొన్న విషయం తెలిసిందే. తీవ్రమైన ఎండ‌, వ‌డ‌గాలుల‌కు బ్రేక్ చెబుతూ.. వ‌ర్షాకాలం వ‌చ్చిన‌ట్లు ఢిల్లీలోని ఐఎండీ ఆఫీసు శుక్రవారం ప్రక‌టించింది. యావ‌త్ ఢిల్లీ ప్రాంతాన్ని నైరుతీ రుతుప‌వ‌నాలు చేరుకున్నట్లు తెలిపింది. జైస‌ల్మేర్‌, చురు, భివాని, ఢిల్లీ, అలీఘ‌డ్‌, కాన్పూర్‌, ఘాజిపూర్‌, గోండా, ఖేరి, మొరాదాబాద్‌, డెహ్రాడూన్‌, ఉనా, ప‌ఠాన్‌కోట్‌, జ‌మ్మూ ప్రాంతాల‌కు నైరుతి చేరుకున్నట్లు ఐఎండీ వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.