మరో మూడు రోజులు తెలంగాణాలో భారీ వర్షాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలో వాతవారణంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం గరిష్టంగా 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా.. సాయంత్రానికి వాతావరణ చల్లబడి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

నేడు, రేపు ఎల్లుండి హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అక్కడక్కడ వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని చెప్పారు. మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కుమ్రుం భీం, కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న, పెద్దపల్లి, జయశంకర్‌, భద్రాద్రి, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు.

గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కురిసిన వడగళ్ల వానలు రైతులను తీవ్రంగా నష్టం చేకూర్చాయి. మొక్కజొన్న, వరి, మామిడి, మిర్చితో పాటు బత్తాయి, మామిడి, నిమ్మ వంటి ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోసారి వడగళ్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు గురువారం (ఈనెల 23న) సీఎం కేసీఆర్ ఖమ్మం, మహబుబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో అధికారులు రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. రైతులు అధైర్య పడొద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. కౌలు రైతులను కూడా తమ ప్రభుత్వమే ఆదుకుంటుందని చెప్పారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.