ఇకమీదట డ్వాక్రా సంఘాల చేతికి మీసేవ కేంద్రాలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న మీ సేవ కేంద్రాలకు అదనంగా అవసరమైన ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళాశక్తి పథకం కింద మీసేవ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన మహిళా శక్తి క్యాంటీన్లకు అదనంగా మహిళా శక్తి మీ సేవ కేంద్రాలను ప్రారంభించనుంది. మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల సభ్యులకు వీటిని మంజూరు చేయనుంది. పలు పథకాలకు తోడుగా డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఆయా సంఘాలకు ఆర్థిక సాయం అందించి మరీ వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అర్హత ఉన్న డ్వాక్రా సంఘానికి రూ.2.50 లక్షల వరకు రుణం రూపంలో ఆర్థిక సాయం అందించి, ప్రభుత్వం తరఫున వారధిగా సంఘం మహిళలు మీ సేవా కేంద్రాలను నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ ఏడాది ఆగస్టు 15 నాటికల్లా ఈ మహిళా మీ సేవ కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించాలని సంకల్పించింది. ప్రస్తుతం పట్టణ, నగర, మండల కేంద్రాలు, మరికొన్ని డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే మీ సేవ కేంద్రాలు పని చేస్తున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మీ సేవా కేంద్రాల సేవలు చాలా చోట్ల అందుబాటులో లేకపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేసుకోవడంతో పాటు స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు, కాలేజీ సీట్లకు దరఖాస్తు చేసుకోవడం వంటి వాటితో పాటు కరెంటు బిల్లులు, ఇతరత్రా అనేక చలాన్లు చెల్లింపులు వంటివన్నీ మీ సేవ కేంద్రాల ద్వారానే జరుగుతున్న నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మీసేవా కేంద్రాలకు డిమాండ్ ఉంటుంది. ఇందుకు అనుగుణంగా మీ సేవ కేంద్రాలను డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృధ్ధి శాఖ అంచనా వేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.