తమ పార్టీ ఇప్పటికే అమరావతి రాజధానికి కట్టుబడి ఉంది

-   కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రస్తుతం ఏపీ రాజధాని విషయంలో ఎవరు ఏం మాట్లాడినా రాజకీయంగా పెను దుమారం రేగుతోంది. ముఖ్యంగా బీజేపీ నాయకులు.. అందునా కేంద్ర మంత్రులుగా ఉన్నవారు.. అసలు రాజధాని ప్రస్తావనే లేకుం డా.. రాష్ట్ర పర్యటనలు ముగించేస్తున్నారు. దీనికి రాజకీయంగాను న్యాయపరంగాను కూడా ఇబ్బందులు ఉన్నాయి. దీంతో ఏపీ రాజధాని అంశంలో ఆచి తూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది.అయితే.. అనూహ్యంగా కేంద్ర పర్యాటక మంత్రి తెలుగు నాయకుడు.. కిషన్ రెడ్డి.. ఏపీ రాజధాని విషయం లో చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో అక్కడ పోటీలో ఉన్న బీజేపీ నాయకుడు మాధవ్ తరఫున కిషన్ రెడ్డి ప్రచారం చేశారు. అయితే.. ఈ సందర్భంగా ఆయన విశాఖ రాజధాని‘ అనే కామెంట్ చేశారు. దీంతో ఇది కాస్తా వివాదానికి దారి తీసింది.వైసీపీ ప్రభుత్వ పెద్దలు విశాఖను రాజధాని చేయాలని చూస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అమరావ తి డిమాండ్ ఓ వైపు వినిపిస్తోంది. దీంతో ఇది కాస్తా న్యాయపోరాటంలో ఉంది. ఫలితంగా.. ఎవరూ కూడా బాహాటంగా రాజధానిపై ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. ఈ క్రమంలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్య.. ప్రభుత్వ అనుకూల మీడియాలో జోరుగా వైరల్ అయింది. వాస్తవానికి.. బీజేపీ అమరావతినే సపోర్టు చేస్తున్న విషయం తెలిసిందే.దీంతో కిషన్ చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీశాయి. దీంతో ఆయనే స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు. తాను విశాఖ జిల్లాను దృష్టిలో పెట్టుకుని చేసిన వ్యాఖ్యలేనని చెప్పారు. తమ పార్టీ ఇప్పటికే అమరావతి రాజధానికి కట్టుబడిందని ఈవిషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు.తాము.. కూడా పార్టీ లైన్కే కట్టుబడి ఉన్నామన్నారు. అయితే.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు అప్పుడే.. వైరల్ కావడంతో బీజేపీ ఇమేజ్పై మరో మరక పడినట్టు అయిందని అంటున్నారు పరిశీలకులు.

Leave A Reply

Your email address will not be published.