హైదరాబాద్‌ నగరంలో పార్కింగ్‌ సమస్యకు ఎలా చెక్‌ పెడదాం..

-   సలహాలు కోరిన మంత్రి కేటీఆర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పార్కింగ్‌ సమస్యను పరిష్కరించడం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఒక సవాలుగా మారిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లో పార్కింగ్‌ సమస్యను పరిష్కరించేందుకు పలు ఎంఎల్‌పీలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇలాంటి ఎంఎల్‌పీలు ఇంకా చాలా చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపాలని బిపిన్‌ సక్సెనా అనే నెటిజన్‌ చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్‌ ఈ విధంగా స్పందించారు.హైదరాబాద్‌లోని ఓల్డ్‌ సిటీ, న్యూసిటీస్‌లో పార్కింగ్‌ అనేది ప్రధాన సమస్యగా మారింది. సికింద్రాబాద్‌, ఓల్డ్‌ సిటీల్లోని మార్కెట్లకు దగ్గరలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి.. అందులో పార్కింగ్ కోసం బిల్డింగ్‌లను నిర్మించాలని బిపిన్‌ సక్సేనా అనే వ్యక్తి ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఈ మేరకు ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించే ఐడియాతో ఒక వీడియోను పోస్టు చేశారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్‌.. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు పార్కింగ్‌ అనేది ప్రధాన సమస్యగా మారిందని అంగీకరించారు. పార్కింగ్‌ సమస్య తలెత్తకూడదనే.. కొత్తగా నిర్మించబోయే మెట్రో మార్గాల్లో పెద్ద ఎత్తున పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేసి పార్క్‌ అండ్‌ రైడ్‌ మోడ్‌ను ప్రయోగాత్మకంగా ప్రయత్నించబోతున్నామని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.