కాలుష్యంతో మానవ మనుగడ ప్రశ్నార్ధకం

తెలంగాణ  జ్యోతి/వెబ్ న్యూస్:

 సమస్త జీవకోటికి  జీవనాధారమైన భూగోళం నేడు కాలుష్యం గుప్పిట్లో చిక్కుకొని విలవిలలాడుతున్నది .  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. పర్యావరణ వ్యవస్థకు అస్థిరత , అసమానత , హాని కలిగించే విధంగా కలుషిత పదార్థాలను పరిసరాలలోకి విడుదల చేయడాన్ని కాలుష్యం అంటారు  . ఇది రసాయనిక పదార్థాలు , ధ్వని , వేడిమి , కాంతి వంటి శక్తి రూపాల్లో ఉంటుంది .   అభివృద్ది , ఆధునికత  నవనాగరికత , లగ్జరీ లైఫ్ పేరుతో మానవుని పనికిమాలిన  చర్యలతో అవసరానికి మించి ప్రకృతి వనరుల దుర్వినియోగం వల్ల ,  సుమారు 450 కోట్ల సంవత్సరాల వయస్సు గల భూగోళం , కేవలం  గత 300 ఏండ్ల నుండి   కాలుష్య కాసారంగా మారుతోంది .

 పెరుగుతున్న ప్రపంచ జనాభా కారణంగా నీరు , విద్యుత్ , ఇందనాలు ,ఖనిజ వనరులకు గిరాకీ పెరిగి తీవ్ర కాలుష్యానికి , భూతాపవృద్దికి దారితీస్తున్నది . నేడు మనం పీల్చే గాలి , తాగే నీరు , తినే ఆహారం అన్నీ కలుషితమై మనిషి మనుగడను ప్రశ్నిస్తున్నాయి .  ఆహ్లాదకరమైన  , ఆరోగ్యకరమైన భూమి ( హెల్దీ ప్లానెట్ ) కాకుండా కలుషిత వాతావరణంతో కూడిన అనారోగ్యమైన భూమి ( సిక్ ప్లానెట్ ) ను రాబోవు తరాలకు వారసత్వ అస్థిగా ఇవ్వబోతున్న దుస్థితి నెలకొనడం శోచనీయం .  ఇటీవల 184 దేశాలకు చెందిన సుమారు 1700 మంది ప్రపంచ శాస్త్రజ్ఞుల బృందం సమావేశమై పర్యావరణ విద్వంసం , కాలుష్యం తదితర అంశాలపై  “  సెకండ్ వార్నింగ్ టు హ్యూమానిటి -2017  “ పేరున భూమి ప్రమాదపు కోరల్లో చిక్కుకుందని రెండవ గ్లోబల్ నోటీస్ ద్వారా  హెచ్చరించిన విషయం గమనించాలి . 25 ఏండ్ల క్రితమే మొదటి గ్లోబల్ నోటీస్ ద్వారా కూడా  పర్యావరణ విద్వాంసంపై  హెచ్చరించిన విషయాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది .  కాలుష్య ప్రభావాలు ,  కాలుష్య నియంత్రణపై   ప్రజల్లో సరైన అవగాహన కల్పించేందుకు ప్రతి యేటా “  ప్రపంచ కాలుష్య నివారణ దినోత్సవం “ ను జరుపుకోవాలని   ఐక్యరాజ్యసమితి , ప్రపంచ ఆరోగ్య సంస్థ , గ్రీన్ పీస్ తదితర అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ దేశాలకు దిశానిర్దేశనం చేశాయి . మన దేశంలో 1984 డిసెంబర్ 2 , 3 తేదీలలో రాత్రి పూట జరిగిన బోపాల్ లోని యూనియన్ కార్బైడ్ కెమికల్ ఫ్యాక్టరీ నుండి మిథైల్ ఐసో సయనేట్ ( MIC ) అనే విష వాయువు లీకయ్యింది . ఈ ఘోర దుర్ఘటనలో చనిపోయిన  ప్రజల  స్మారకార్థం ప్రతి ఏడాది డిసెంబర్ 2 వ తేదీన “  జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం”ను జరుపుకొంటున్నాం . ప్రతి సంవత్సరం కాలుష్యంతో ప్రపంచ మనవాళికి జరిగే నష్టాన్ని తెలియజెప్పడం , పౌరులు కాలుష్యానికి వ్యతిరేఖంగా పోరాడేలా అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించుకోవడం జరిగింది .

                   కనువిప్పు కలిగించని కాలుష్యం  : పొల్యూషన్ ( కాలుష్యం ) అంటే లాటిన్ భాషలో పొల్యూటోనియం అనే అర్ధం . కాలుష్యం ప్రధానంగా వాయుకాలుష్యం , నీటికాలుష్యం , నేలకాలుష్యం , శబ్దకాలుష్యం , ఉష్ణకాలుష్యం రేడియోధార్మిక కాలుష్యం , కాంతికాలుష్యం   అను రకాలుగా ఉంటుంది . ప్రముఖ అమెరికన్  ఆధునిక ఆవరణ శాస్త్రవేత్త ఒడమ్ అభిప్రాయం  ప్రకారం ‘ అపరిమితంగా పెరుగుతున్న మానవ జనాభా అవసరాలు , పట్టణీకరణ , జనవాసాలకై అడవుల నరికివేత , వాతావరణ మార్పులు , పరిశ్రమలు ఎక్కువగా స్థాపించడం వంటివన్ని కలుషితాలు ఏర్పడటానికి  కారణమవుతున్నాయి ‘ . సల్ఫర్ డై ఆక్సైడ్ , కార్భన్ డై ఆక్సైడ్ , కార్బన్ మోనాక్సైడ్ ,  అమ్మోనియా , ఫ్లోరిన్ , క్లోరిన్ , హైడ్రోజన్ వంటి వాయువులు  , సీసం , ఇనుము , జింకు , పాదరసం వంటి మూలకాలు , రసాయన ఎరువులు , న్యూక్లియర్ వ్యర్థాలు ,   హెర్బిసైడ్స్ , పెస్టిసైడ్స్ , వీడిసైడ్స్ , రేడియో ధార్మిక పదార్థాలు , శబ్ధం , అధిక ఉష్ణం , పొగ ,  దుమ్ము , ధూళి  ఇవన్నీ కాలుష్యకారకాలే . ప్రతి యేటా 5200 టన్నుల అంతరిక్షధూళి ( స్పేస్ డస్ట్ ) లేదా కాస్మిక్ డస్ట్ కంటికి కనిపించకుండా , వర్షం లాగా భూమి పైకి వచ్చి చేరుతోందని “ ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసర్చ్ “ కు చెందిన శాస్త్రజ్ఞుల బృందం రిపోర్ట్ -2021 తాజాగా  తేల్చిచెప్పింది . కాలుష్యం అనగానే కేవలం వాహన , ఫ్యాక్టరీల గొట్టాల  నుండి వెలువడే పొగ మరియు దుమ్ము ,  ధూళి  అని ఊహించుకోవద్దు . ఇంట్లో టైల్స్ తుడువడానికి వాడే క్లీనర్స్ నుంచి సబ్బులు , షాంపులు , ప్లాస్టిక్ , ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దాకా అన్నీ కాలుష్యాన్ని కలిగించేవే . పెయింట్స్ , నాన్ స్టిక్ కుక్ వేర్స్ , స్టెయిన్ రెసిస్టన్స్ ప్రొడక్ట్స్ , ఫోటోగ్రఫి , మంటలు అర్పేందుకు వాడే నురుగ , టేప్లాన్ కోటింగ్ పాత్రలు , ఫాస్ట్ ఫుడ్ ప్యాకేజింగ్ , పెస్టిసైడ్స్ మొదలగు వాటిలో “ ఫర్ ఎవర్ కెమికల్స్ “ గా పిలువబడే పాలి ఫ్లోరో అల్కైల్స్ ( PFA ) ఎక్కువగా ఉన్న వస్తువులను విరివిగా వాడటం వల్ల సమస్య మరింతగా జటిలమవుతోంది . కాలుష్యం వల్ల కలిగే హరితగృహ ప్రభావం వల్ల భూతాపం పెరిగి దృవాల దగ్గర  మంచు కరగడంతో సముద్రతీర పట్టణాలు నీట మునుగనున్నాయి . మురుగునీరు జలాశయాల్లో చేరటం వల్ల ఏర్పడే యుట్రీఫికేషన్ తో జలజీవులు నశిస్తున్నాయి . ఆమ్లవర్షాల వల్ల ధన , ప్రాణ , ఆస్తి నష్టాలు కలుగుతున్నాయి .   కాలుష్యం వల్ల  మానవులలో పల్మనరీ ఎడిమా , ఆస్తమా , సైనటైటిస్ , బ్రాంకైటీస్  వంటి శ్వాససంబంధమైన వ్యాధులు , జాండిస్ , కలరా , టైఫాయిడ్ , డయోరియా వంటి నీటి జనిత వ్యాధులు ( WATER BORNE DISEASES )  మరియు  క్యాన్సర్ , లుకేమియా , అకాల వార్థక్యం , లివర్ సిర్రోసిస్ , కార్డియో-వాస్కులర్ వ్యాధులు ,  శిశుమరణాలు కలగడం  , హైపర్ టెన్షన్ ,   మానసిక వైకల్యం వంటి అపసవ్యతలు  కలుగుతాయి . క్లోరోఫ్లోరో కార్భన్ ( CFC ) వల్ల  ఓజోన్ పొర పలుచబడటంతో ,  వచ్చే అతినిలలోహిత కిరణాల కారణంగా చర్మ క్యాన్సర్ కలుగుతుంది . నిద్రలేమి , వికారం , అధిక రక్తపోటు , అల్సర్లు , తలనొప్పి , వినికిడి సమస్యలు అనునవి అధిక శబ్ద కాలుష్యం వల్ల కలుగుతున్నాయి .   మనం నిత్యం వాడే ప్లాస్టిక్ ను మృదువుగా ఎటుపడితే  అటు వంగేటట్లు చేయడానికి ఫాలెట్స్ ను ,  ప్లాస్టిక్ ను గట్టిగా చేయడానికి బిస్పెనాల్-ఏ ను వినియోగిస్తాము  .   పురుషులు ఫాలెట్స్ కు ఎక్కువగా గురి కావడం వల్ల వీర్యకణాల సంఖ్య ( స్పెర్మ్ కౌంట్ ) తగ్గుతోందని , బిస్పెనాల్-ఏ వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ విడుదల తగ్గుతోందని , ఫలితంగా స్త్రీ , పురుషులలో పునరుత్పత్తి సామర్థ్యం క్రమంగా  దెబ్బతింటోందని ప్రముఖ అమెరికన్ పర్యావరణవేత్త డాక్టర్ షన్నాస్వాన్ తాజాగా తన “ కౌంట్ డౌన్  2021 “ పుస్తకంలో ఆందోళన వ్యక్తం చేసింది . నానాటికీ పెరిగిపోతున్న ఈ  కాలుష్యపు ముప్పు మానవజాతి మనుగడకే పెనుసవాల్ విసరుతోందని హెచ్చరించింది . కనుక పాలకులు , ప్రజలు  సమిష్టిగా పనిచేస్తూ ,  కాలుష్య నియంత్రణను  సామాజిక బాధ్యతగా తీసుకొని కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది .కాలుష్యనియంత్రణ-సామాజిక బాధ్యత : నేడు కాలుష్యం అంతర్జాతీయ  సమస్యగా మారింది . ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ప్రత్యక్ష , పరోక్ష కారణం భూతాపమే అని పర్యావరణవేత్తలు బలంగా  అభిప్రాయపడుతున్నారు . ప్రభుత్వాలు , పాలకులు , బడా పారిశ్రామికవేత్తలు అవలంభిస్తున్న పారిశ్రామిక , సాంకేతిక విధానాలు ప్రకృతి విధ్వంసానికి కారణమవుతున్నాయి .  ప్రపంచీకరణ , పట్టణీకరణ , పారిశ్రామికరణ ,  కార్పొరేటీకరణ ప్రభావం వల్ల పాలకులు , ప్రజలు కాలుష్య నియంత్రణకు చిత్తశుద్దితో పనిచేయడం లేదనేది సుస్పష్టం  . ప్రపంచ ఆరోగ్య సంస్థ వాయు నాణ్యతా రిపోర్ట్ -2022 ప్రకారం ప్రపంచ జనాభాలో సుమారు  99% మంది ప్రజలు   నాణ్యమైన , స్వచ్చమైన గాలి పీల్చడం లేదు . ప్రపంచంలోని 100 వాయు కలుషిత నగరాల్లో డిల్లీ , ముంబై  , కలకత్తా నగరాలున్నాయి  . డిల్లీలో జరిగినంత గాలి కాలుష్యం గత 7 సంవత్సరాలలో ఎన్నడూ జరుగలేదని ఇటీవల  జాతీయ కాలుష్య నియంత్రణ మండలి నివేదిక -2021 పేర్కొనడం ఈ సందర్భంగా గమనించాలి . ఈ కాలుష్య ముప్పును ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు మరియు  ప్రజలు చిత్తశుద్దితో , విశేషమైన కృషి చేయాలి . ప్రపంచంలో 2050 నాటికి కార్భన్ ఉద్ఘారాలు జీరో కు చేరుకోవాలనే లక్ష్యంతో ప్రారంభించబడిన జీరో-19 ఉద్యమాన్ని సఫలీకృతం చేయాలి . కఠినమైన కాలుష్య నియంత్రణ చట్టాలను రూపొందించి , అమలుపరచాలి . శిలాజ ఇందనాలకు బదులు  సౌర , పవన , టైడల్ విద్యుత్ వంటి శుద్దమైన పున: పూరకమైన ఇందనాలను విరివిగా వాడాలి . గత నెల నవంబర్ 2022 లో ఈజిప్ట్ లో  జరిగిన కాప్-27 ( CONFERENCE OF PARTIES-27 ) సదస్సులో  వాతావరణ కాలుష్యంపై చర్చించిన పరిహారపు సొమ్ము  “ పేమెంట్ ఓవర్ డ్యూ “ ను కాలుష్యానికి కారణమైన  దనికదేశాలు , పెద దేశాలకు తక్షణమే చెల్లించే కార్యాచరణను రూపొందించాలి . గాలి కాలుష్యాన్ని తగ్గించుటకు రైతులను చైత్తన్యపరిచి , వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయడం ఆపాలి . కాలుష్య ప్రాంతాలలో చెట్లను , పక్షులను ప్రత్యేక శ్రద్దతో పెంచాలి . “ తెలంగాణకు  హరితహారం “ లాంటి మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తృత పరుచాలి . జలసంరక్షణపై ప్రజలకు గ్రామస్థాయి నుండి అవగాహనా కార్యక్రమాలను  నిర్వహించాలి .  పి‌ఎఫ్‌ఏ లు ఉండే ఉత్పత్తులను నిషేదించాలి . ప్రజలు ప్యాకేజ్-ప్రాసెస్డ్ ఆహారాన్ని తీసుకోకూడదు . ఓవెన్ లు , ప్లాస్టిక్ పాత్రలలో వండిన పదార్థాలను తినకూడదు . కాలుష్య నియంత్రణ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి . విద్యార్థులను పర్యావరణ పరిరక్షణ సైనికులుగా తీర్చిదిద్దాలి .  ప్రముఖ అమెరికన్ జీవశాస్త్రవేత్త మరియు   పర్యావరణవేత్త డాక్టర్ బేరీ కామనర్ పర్యావరణ కాలుష్యం గురించి చక్కగా చెప్పాడు… “ కాలుష్యం ఒక నయం కానీ వ్యాధి . దీనిని కేవలం నివారించగలం “ . ఈ మాటల స్పూర్తితో  ప్రపంచ మానవాళి కలిసికట్టుగా  కాలుష్యరహిత సమాజ నిర్మాణంలో సంపూర్ణ భాగస్వాములు కావాలని ఆశిద్దాం .

Leave A Reply

Your email address will not be published.