ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తుంటే.. గాలికి తిరుగుతున్న మున్సిపల్ మంత్రి     

- బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ విమర్శ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్- పరిసర ప్రాంతాల్లో  వరదనీటి ఇబ్బందులు తొలగించేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, అనేకమంది మృత్యువాత పడుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని  బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్  ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకూ కేసిఆర్ కుటుంబ సభ్యులే ఎక్కువకాలం పురపాలక శాఖకు ప్రాతినిధ్యం వహించారని ఈ సందర్బంగా గుర్తుచేశారు. కానీ నిన్న నాలుగేళ్ల మిథున్ రెడ్డి మ్యాన్ హోల్ లో పడి మరణించాడని,   కొంతకాలం క్రితం మౌనిక అనే అమ్మాయి, 2021లో ఆనంద్ సాయి, మల్కాజిగిరిలో సుమేధ సంఘటనలు కూడా మనం ఇంకా మర్చిపోలేదని…. 80 ఏళ్ళ వృద్ధురాలు పాల కోసం వెళ్లి నీళ్ళపాలయ్యారని… ఇలా ఎన్నో సంఘటనలు ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత చోటు చేసుకున్నాయని  పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మ్యాన్ హోల్ మరణాలు, కుంగుతున్న నాళాలు, కూలుతున్న భవనాలు, కాలుతున్న కంపెనీలు, కొట్టుకుపోతున్న చెరువు కట్టలు, కుక్కలా స్వైర విహారం లాంటి ఘటనలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిత్యకృత్యమైపోయాయని ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఇన్ని జరుగుతున్నా పురపాలక శాఖ మంత్రి ఎక్కడున్నారని నిలదీశారు. ఈ ఘటనలన్నింటికీ తండ్రీ కొడుకులు కేసిఆర్-కేటిఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.  మిషన్ కాకతీయ గురించి గొప్పగా చెబుతారని, కానీ ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో సుందరీకరణ చేసిన.. పూడిక తీసిన, ఆనకట్టు పదిలం చేసిన… పిల్లకాలువలు తవ్వించిన పని  నగరంలో ఒక్కటైనా చూపాలని సవాల్ చేశారు.  మిషన్ కాకతీయ ఓ మిథ్యగా మారిందన్నారు. వానలు పడొద్దని మేయర్ దండం పెట్టుకుంటారని, జరిగిన ఘటనలన్నీ వానదేవుడి వల్లేనని నెపం ఆయనపై వేసే పనిలో మున్సిపల్ మంత్రి ఉంటారని వ్యాఖ్యానించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన  చర్యలపై  ముందస్తు ప్రణాళిక, దూరదృష్టి  లేదని, పైగా హైదరాబాద్ అభివృద్ధికి  67 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం పడితే పడవ లేనిదే బైట అడుగు పెట్టలేని దుస్థితి నెలకొందన్నారు.  కేవలం కమీషన్లు, కాంట్రాక్టుల కోసమే పనులు చేస్తున్నారు కానీ ప్రజల అవసరాలకోసం నిర్దిష్ట చర్యలు  చేపట్టిన దాఖలాలు లేవన్నారు.కుత్బుల్లాపూర్, మియాపూర్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో మునుగుతున్న కాలనీలే మళ్ళీ, మళ్ళీ మునుగుతున్నా ఎలాంటి చర్యలూ లేవని ప్రభాకర్ పేర్కొన్నారు. చెరువులు ఆక్రమిస్తున్నది, అక్రమ కట్టడాలు ప్రోత్సహిస్తున్నది…భారీ స్థాయిల్లో అనుమతులు సంపాదిస్తున్నది బిఆర్ ఎస్ నేతలు, కార్పొరేటర్లు మాత్రమేనని ఆయన ఆరోపణలు చేశారు.రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో అత్యధిక ఆదాయం సమకూరుస్తోన్న హైదరాబాద్ నగర అభివృద్దిపై ఏమాత్రం దృష్టి పెట్టడంలేదని, కేవలం జేబులు నింపుకోవడానికే పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిలేని మంత్రిని (కేటిఆర్) ఎంత త్వరగా తొలగిస్తే అంత మంచిదన్నారు. మంత్రి తన బాధ్యతలు విస్మరించి, గాలికి తిరుగుతున్నారని.. వీరికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని ప్రభాకర్ హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.