ఇప్పుడుకిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే బిజెపి కి 284 సీట్లు

- ఇండియా టుడే– సీ వోటర్ 'మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్' వెల్లడి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  లోక్ సభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే దేశ ప్రజలు నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నట్లు ఇండియా టుడే– సీ వోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్‘ వెల్లడించింది. ఇప్పుడుకిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ 284 సీట్లు గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది.
కాగా కాంగ్రెస్ గతంతో పోల్చితే బాగా మెరుగుపడింది. ఇప్పుడుకిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 191 సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో తేలింది. ఈ సర్వే కోసం మొత్తం 140917 మంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ పనితీరుపై 72 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది. మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ జనవరి ఎడిషన్ ప్రకారం.. ద్రవ్యోల్బణం కోవిడ్ –19 మహమ్మారి గత మూడేళ్లుగా చైనా బెదిరింపులు ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వంవైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు.వరుసగా దాదాపు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత కూడా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పనితీరుపై 67 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఆగస్టు 2022 నుండి ఈ సంఖ్య 11 శాతం పెరగడం విశేషం.ఆగస్ట్ 2022లో ఎన్డీఏ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసినవారు 37 శాతం ఉండగా అది ఇప్పుడు 18 శాతానికి తగ్గిందని సర్వే తేల్చింది.కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కోవడం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ అతిపెద్ద విజయమని 20 శాతం మంది అభిప్రాయపడ్డారని సర్వే వెల్లడించింది. 14 శాతం మంది ఆర్టికల్ 370ని రద్దు చేయడం ఎన్డీఏ ప్రభుత్వ విజయమని అభిప్రాయపడ్డారు. కాగా సర్వేలో పాల్గొన్న వారిలో 12 శాతం మంది అయోధ్యలో రామమందిరం నిర్మించడం మోడీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమని పేర్కొన్నారు.ఇక ఎన్డిఎ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యం ఏమిటని అడిగిన ప్రశ్నకు.. 25 శాతం మంది ధరల పెరుగుదల అని చెప్పారు. అయితే 17 శాతం మంది నిరుద్యోగాన్ని పరిష్కరించడంలో వైఫల్యం అని అభిప్రాయపడ్డారు. అలాగే కోవిడ్ –19 మహమ్మారిని ఎదుర్కోవడం ఎన్డిఎ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యమని ఎనిమిది శాతం మంది చెప్పారు.కాగా ప్రతిపక్ష నేతగా కేజ్రీవాల్ కి 24 శాతం మంది మమతా బెనర్జీకి 20 శాతం మంది రాహుల్ గాంధీకి 13 శాతం మంది మద్దతు తెలిపారు.రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న జోడో యాత్రతో కాంగ్రెస్ జాతకం మారదని 37 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే ప్రజలతో అనుసంధానమయ్యేందుకు వారి సమస్యలు తెలుసుకునేందుకు ఈ యాత్ర ఉపకరిస్తుందని 29 శాతం మంది చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.