ఎమ్మెల్యే చెప్పినట్టు వింటేనే మనకు పనులవుతాయి
- షాపింగ్ పేరుతో బయటకు రా.. నీ భర్తకు చెప్పకుండా వచ్చెయ్ - బంగారం కొంటాడు.. పిల్లల ఫీజులు కడతాడు.. - ఎమ్మెల్యే చెప్పినట్లు వింటేనే పనులవుతాయ్ - ఎస్సీ సర్పంచ్‌కు బీఆర్ఎస్ మహిళా నేత వల..
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ‘‘నీకసలు లోకం పోకడ తెలియదు. రాజకీయాలు అంటే ఏంటో తెలియవు. ఎమ్మెల్యే చెప్పినట్టు వింటేనే మనకు పనులవుతాయి. లేదంటే నీకు నరకం కనిపిస్తుంది. నేను చెప్పినట్టు విను. ఎమ్మెల్యేకు నీ మీద చాలా ఇంట్రస్ట్ ఉంది. ఒక్కసారి వచ్చి కలువు. అది కూడా భర్త లేకుండా ఒంటరిగా రావాలి. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో’’.. ఇదీ హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని బీఆర్ఎస్ సీనియర్ మహిళా నాయకురాలు ఓ మహిళా సర్పంచ్‌కు విసిరిన వలపువల! మండలంలోని జానకీపురం మహిళా సర్పంచ్ కురసపల్లి నవ్యను ఆ నాయకురాలు అన్ని రకాలుగా ప్రలోభపెట్టింది. కానీ, నవ్య లొంగలేదు. అంతే.. ఆమె చెప్పిందే నిజమైందని, ప్రలోభాలకు లొంగకపోవడంతో తనకు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయని నవ్య వాపోయారు. తనను సర్పంచ్‌గా ఎన్నుకున్న ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నానంటూ మీడియా తో తన గోడు చెప్పుకొన్నారు.
ఆడవాళ్లు ఎంజాయ్ చేయాలంటారు
‘అసలు నువ్వు అమాయకురాలివే కాదు. పిచ్చిదానివి అనిపిస్తోంది’ అంటూ ఆ మహిళా నాయకురాలు ముగ్గులోకి దింపడానికి ప్రయత్నించేదని నవ్య వాపోయారు. ‘ఒక సర్పంచ్‌గా ఖరీదైన చీరలు, మెడలో బంగారంతో హంగామా చేయాలి. నీ పిల్లలను కూడా పెద్ద కార్పొరేట్ స్కూల్లో చేర్పించొచ్చు. ఫీజులు ఎంతైనా ఎమ్మెల్యే చూసుకుంటాడులే. ఆయన మహిళల గురించి ఎంత బాగా ఆలోచిస్తాడో తెలుసా? ప్రజాప్రతినిధులుగా మహిళలకు అవకాశం వస్తే భర్తలు ఎంజాయ్ చేస్తున్నారని, వాస్తవానికి మహిళలే ఎంజాయ్ చేయాలని అంటాడు. తాను ఎంత అవకాశం ఇచ్చినా ఎందుకు ఉపయోగించుకోవడం లేదని చాలా బాధపడతాడు తెలుసా..? నేను చెప్పినట్టువిను. నీ బతుకు ఒక్కసారిగా మారిపోతుంది. నీ భర్తకు చెప్పకుండా షాపింగ్ పేరుతో బయటకు రా. ఆ తర్వాత ఎక్కడ కలవాలో నేను చెబుతా’ అని ఆ నాయకురాలు ఒత్తిడి చేసిందని నవ్య తెలిపారు. ‘అక్కా.. ఇవన్నీ నాతో కాదు, వదిలెయ్. నువ్వు ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాట నా భర్తకు చెబుతా. మమ్మల్ని నమ్మి అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకోసం ఇంతకాలం రాజకీయాల్లో ఉన్నా. ఇదే పరిస్థితి కొనసాగితే ఒక్క క్షణంలో సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తా’ అని చెప్పడంతో వెంటనే ఆమె ఫోన్ కట్ చేసిందని నవ్య తెలిపారు.
నిజానికి రాజకీయాలంటే తనకేమాత్రం ఇష్టం లేదని, తన భర్త ప్రవీణ్‌కు ఆసక్తి అని చెప్పారు. ఎస్సీ మహిళా రిజర్వేషన్ వల్ల సర్పంచ్‌గా అవకాశం వచ్చిందని, అదే తనకు శాపంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలంటే ఇంత ఛండాలంగా ఉంటాయా..? అని వెగటు పుడుతోందన్నారు. ఆ నాయకురాలు చెప్పినట్లు వినకపోవడంతో అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయని నవ్య చెప్పారు. గ్రామంలో పేరుకే తాను సర్పంచ్‌నని.. పెత్తనం అంతా ఒక దొర చేతిలోనే ఉంటుందని తెలిపారు. ‘‘మాకు తెలియకుండానే పార్టీ కార్యక్రమాలు జరుగుతాయి. మా ఊర్లో మా ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. మండల ప్రజాపరిషత్, రెవెన్యూ కార్యాలయాలకు వెళితే అధికారులు పట్టించుకోరు. చివరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు సైతం నాకు ఆహ్వానం లేదు. ఆ అక్క ఏం చెప్పిందో ఏమో..? అప్పటి నుంచి అవమానాల పరంపర మొదలైంది. నాకే కాదు.. నియోజకవర్గంలో చాలామంది మహిళలకు ఇదే పరిస్థితి. వయసు లేదు, వరస లేదు, సమయం లేదు, సందర్భం లేదు. ఆడదైతే చాలు.. అన్న దుర్మార్గ స్థితి కొనసాగుతోంది’’ అని నవ్య వాపోయారు.
‘‘నేను దళిత మహిళను. కొద్దో గొప్పో చదువుకున్నదాన్ని. ఇంగ్లిష్, హిందీ భాషలను కూడా మాట్లాడగలను. నేనెందుకు భయపడాలి. ఇలాంటి చిల్లర వేషాలకు భయపడేదాన్ని కాదు. ఆ మహిళ నాతో మాట్లాడిన ప్రతి మాట నా భర్తకు చెప్పడంతో వెళ్లి ఆమెకు వార్నింగ్ ఇచ్చి వచ్చాడు. ఆ వెంటనే మాకు పెద్ద నాయకుల నుంచి ఎన్నో ఫోన్లు వచ్చాయి. మేము అవి పట్టించుకునే స్థితిలో లేం’’ అని నవ్య చెప్పారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణలో పాలన అందిస్తున్న కేసీఆర్, కేటీఆర్‌లు ఇలాంటి వారిపై దృష్టి సారించాలని నవ్య కోరారు. ఇలాంటి వాళ్లవల్ల పార్టీకి చాలా నష్టం జరుగుతోందన్నారు. త్వరలో అన్ని ఆధారాలతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను కలుస్తామని నవ్య చెప్పారు. తమకు న్యాయం జరుగుతుందన్న ఆశ ఉందన్నారు.
చిలిపి చేష్టలకు కేరాఫ్.. ఆ ఎమ్మెల్యే!
ఆ ఎమ్మెల్యేకు మహిళలు కనిపిస్తే చాలు.. ఆగలేరన్న ప్రచారం ఉంది. ప్రచారమే కాదు.. అనేక సార్లు ఆయన చిలిపి చేష్టల ఆడియోలు నెట్టింట వైరల్ కూడా అయ్యాయి. ఆయన పుట్టినరోజు వేడుకల్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆ వీడియో కూడా వైరలైంది. ఆయన పెద్ద పదవిలో ఉన్నప్పుడు సాయుధ బలగాల రక్షణ వలయంలో గంటల తరబడి ‘ఓ ఇంట్లో’ సేద తీరడంతో.. ఆ ఊరి వారంతా ఇబ్బంది పడ్డారు. చాటింగ్లకు కేరా్‌ఫగా చెప్పుకొనే ఈ ఎమ్మెల్యే.. చేసిన ఓ చాటింగ్ మిస్‌ఫైర్ అయి పదవి పోవడానికి కారణమైందన్న ప్రచారం ఉంది.