నసురుల్లాబాద్‌లో జోరుగా అక్రమ మొరం తవ్వకాలు

.. కొండలను మాయం చేస్తున్న అక్రమార్కులు .. వాల్టా చట్టానికి తూట్లు .. ప్రేక్షక పాత్ర వహిస్తున్న రెవెన్యూశాఖ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ వెబ్‌ న్యూస్‌ ప్రతినిధి బాన్సువాడ: నసురుల్లాబాద్‌ మండలకేంద్రంలోని పాతూరు సమీపంలో గల చెరువుకట్టను ఆనుకుని ఉన్న ఊరగుట్టను గత వారం రోజులుగా కొంతమంది అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా యంత్రాలతో మొరం తవ్వకాలు చేపడుతున్నారు. రోజు పదుల సంఖ్యలో టిప్పర్లలో తవ్వకం చేసిన మొరాన్ని గుత్తేదారులకు తరలిస్తు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. నిబందనల ప్రకారం మొరం తవ్వకాలు చేపట్టాలంటే ప్రభుత్వానికి సీనరేజి చార్జీలు చెల్లించి అనుమతులు పొందవలసి ఉంటుంది. ఇక్కడ ఆ నిబందనలు ఏవీ అమలుకు నోచుకోవడం లేదు. సాక్షాత్తు తహసీల్దార్‌ కార్యాలయ ఎదుట నుండే అక్రమ మొరం రవాణా జరుగుతున్నప్పటికి సంబందిత శాఖ అధికారులు ప్రేక్షకపాత్ర వహించడం పలు అనుమానాలకు తావిస్తుంది. గతంలో ఇదే గుట్ట ప్రాంతం నుండి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడకల ఇండ్ల నిర్మాణాలకు మొరం తరలించారు. ప్రస్థుతం ప్రభుత్వ అభివృద్ది పనుల పేరు చెప్పి బీర్కూర్‌ మండల పరిధిలోని మాంజీరా శివారులో కొనసాగుతున్న ఇసుక రీచ్‌లకు ఈ మొరం తరలిస్తున్నట్లు తెలుస్తుంది. పాతూర్‌ నుండి చిన్నపాటి రోడ్డు ద్వారా ఈ మొరం రవాణా పదుల సంఖ్యలో టిప్పర్లలో జరుగుతుండడంతో ఆ కాలనీవాసులు, పాదచారులు, చిన్నారులకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు లేకపోలేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏదిఏమైనప్పటికి అక్రమ మొరం తవ్వకాలు చేపడుతున్న వాహనాలను సీజ్‌ చేసి సదరు గుత్తేదారుకు భారీగా జరిమానా విదించాలని గ్రామప్రజలు కోరుతున్నారు.

.. మొరం తవ్వకాల విషయం తమ దృష్టికి రాలేదు, వస్తే చర్యలు తీసుకుంటాం
.. బావయ్య, తహసీల్దార్‌
నసురుల్లాబాద్‌ మండలకేంద్రంలో జరుగుతున్న అక్రమ మొరం తవ్వకాల విషయమైన తెలంగాణ వెబ్‌ న్యూస్‌ ప్రతినిధి తహసీల్దార్‌ బావయ్యను వివరణ కోరగా మొరం తవ్వకాల విషయం తమ దృష్టికి రాలేదు. గత నెల అభివృద్ది పనులకు మొరం తవ్వకాలు జరిగాయి. ప్రస్థుతం తవ్వకాలకు ఎలాంటి అనుమతి లేదు. తవ్వకాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.

Leave A Reply

Your email address will not be published.