తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. టీటీడీ కీలక ప్రకటన

.. ఈ మూడు రోజులు మాత్రమే

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తిరుమల శ్రీవారి భక్తుల్ని టీటీడీ అలర్ట్ చేసింది. అక్టోబ‌రు 24, 25, నవంబరు 8న బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 24న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో దీపావళి ఆస్థానం.. అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా ఈ మూడు రోజుల్లో బ్రేక్ ద‌ర్శనాలను రద్దు చేసినట్లు తెలిపారు. అక్టోబర్ 24న దీపావళి ఆస్థానం కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున అక్టోబర్ 23న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలియజేశారు. అలాగే అక్టోబ‌రు 25న మంగ‌ళ‌వారం సూర్యగ్రహణం రోజున ఉద‌యం 8 నుంచి రాత్రి 7.30 గంట‌ల‌ వరకు దాదాపు 12 గంటలు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. ఈ కార‌ణంగా బ్రేక్ ద‌ర్శనం రద్దు చేసినందున అక్టోబర్ 24న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపారు. న‌వంబ‌రు 8న చంద్ర‌గ్రహణం రోజున ఉద‌యం 8.30 నుండి రాత్రి దాదాపు 7.30 గంట‌ల‌ వరకు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. ఈ కార‌ణంగా బ్రేక్ ద‌ర్శనం రద్దు చేసినందున నవంబరు 7న సిఫార్సు లేఖలు స్వీకరించరని తెలియజేశారు. అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబ‌రు 8న చంద్ర‌గ్రహణం రోజుల్లో శ్రీ‌వాణి, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లను కూడా టీటీడీ రద్దు చేసింది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టీటీడీకి స‌హ‌క‌రించాల‌ని కోరారు. అంతేకాదు ఈనెల 25, నవంబర్‌ 8న సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా తిరుమల శ్రీవారి దర్శన వేళలను కూడా కుదించారు. ఆయా రోజుల్లో సర్వదర్శనం మాత్రమే ఉంటుందని తెలిపారు. సూర్య, చంద్ర గ్రహణాల రోజు స్వామివారి ఆలయం తలుపులు 12 గంటల పాటు మూసివేస్తారు. ఈ కారణంగా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో గ్రహణాల రోజుల్లో బ్రేక్‌, ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు గ్రహణాల సమయంలో అన్నప్రసాద పంపిణీ సైతం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భక్తులు విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది. ఈ మార్పులకు తగ్గొట్లుగా తిరుమల ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.