నిబంధనలను ఉల్లంఘించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు జైలు శిక్ష

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇక వివిధ అంశాల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు క్షేత్ర స్థాయి అధికారులు నిబంధనలను ఉల్లంఘించడం హైకోర్టు ఆదేశాల అమల్లో నిర్లక్ష్యం చేయడం రివాజుగా మారిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తమ ఆదేశాలను ధిక్కరించిన అధికారులపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకుగానూ ఏకంగా ఐదుగురు అధికారులకు నెల రోజులపాటు జైలు శిక్ష విధించింది. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతోపాటు మరో ముగ్గురికి నెల రోజులు జైలు శిక్ష జరిమానా విధిస్తూ హైకోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది.ఏపీఎస్ ఆర్టీసీలో ఫీల్డ్ మెన్లగా పనిచేస్తున్నవారిని క్రమబద్ధీకరించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆర్టీసీలో ఫీల్డ్ మెన్గా పనిచేస్తున్న చిత్తూరుకు చెందిన బి.సురేంద్ర మరో ముగ్గురు తమ సర్వీస్ ను క్రమబద్ధీకరించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న హైకోర్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని వారి జీతాలకు 7% వడ్డీ కలిపి చెల్లించాలంటూ 2022 ఆగస్టులో ఆదేశించింది.అయితే అధికారులు హైకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో అధికారులపై ఫీల్డ్ మెన్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు తాజాగా విచారణ చేపట్టింది.తమ ఆదేశాల అమలులో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతోపాటు మరో ముగ్గురు అధికారులపై హైకోర్టు మండిపడింది. వారికి నెల రోజులు జైలు శిక్ష విధించడంతోపాటు రూ.1000 జరిమానా విధించింది. అంతేకాకుండా మే16వ తేదీలోపు రిజిస్ట్రార్ జనరల్ వద్ద వారు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. వీరిని వెంటనే జైలుకు పంపాలని ఆదేశించింది.కాగా ఆంధ్రప్రదేశ్ లో చట్టాలు నిబంధనల ఉల్లంఘన తమ ఆదేశాలను అతిక్రమించడం వంటివాటిపై ఇప్పటికే ఏపీ హైకోర్టు పలుమార్లు ఉన్నతాధికారులను తన వద్దకే పిలిపించుకుని చీవాట్లు పెట్టింది. గతంలో డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్ ను కూడా కోర్టుకు పిలిపించి ఆయనతో చట్టం నిబంధనలను చదివించింది.

Leave A Reply

Your email address will not be published.