జమ్మూలో ఇళ్లలోకి దూరి ఆధార్ తో గుర్తించి హిందువుల హత్య

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పండిట్ల ఊచకోత.. వేలాదిగా హిందువుల వలస.. పొట్టకూటికి వచ్చినవారైనా సరే హిందువని తెలిస్తే దారుణ హత్య.. కూలీలని కూడా కనికరం లేని ఉగ్ర కావరం.. ఇదీ జమ్ముకశ్మీర్ లోని కశ్మీర్ లోయలో అరాచకాండ. మూడు దశాబ్దాల కిందట సాగించిన ఈ మారణకాండ ఇటీవల మళ్లీ చెలరేగుతోంది. జమ్ములో ఉగ్రవాదులు తెగబడ్డారు.ఇప్పటివరకు కశ్మీర్ లోయకే పరిమితమైన తీరులో జమ్ములో విరుచుకుపడ్డారు. హిందువులే లక్ష్యంగా అరాచకం రేపారు. ఎవరూ అనుకోని విధంగా కొత్త సంవత్సరం సాయంత్రం వేళ ఇళ్లలోకి చొరబడి కాల్చి చంపారు. రాజౌరీలో జరిగిన ఈ ఘటన వెనుక వాస్తవాలు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు నలుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. అనూహ్య ఘటనతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భద్రతాబలగాలు భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.

చలికాలం సాయంత్రం వేళ..దట్టంగా మంచు కురుస్తున్న కశ్మీర్ లో ప్రస్తుతం సాయంత్రానికే చీకటిపడే పరిస్థితులు. అలాంటి సమయంలో ఉగ్రవాదులు ఆదివారం రాత్రి 7 గంటలకు రాజౌరీలోని హిందువుల ఇళ్లకు చొరబడి కాల్పులు ప్రారంభించారు. ముందుగా ఆధార్ కార్డు ద్వారా వారు హిందువులా? కాదా? అని పరిశీలించారని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. దీన్నిబట్టే.. హిందువులే టార్గెట్ గా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారని స్పష్టమవుతోంది. వాస్తవానికి ఉగ్రవాదం అధికంగా కశ్మీర్ లోయకే పరిమితం. జమ్ము కానీ అటువైపున ఉండే లద్దాఖ్ లోని ఉగ్ర కార్యకలాపాలకు ఆస్కారం తక్కువ. కానీ జమ్మూ ప్రాంతంలో ఉగ్ర ఘటన జరిగిది. ఇది కశ్మీర్ లో భయాందోళన రేకెత్తించింది.

చొరబడింది నలుగురు.. పది నిమిషాల్లో మారణ కాండ

జమ్మూలోని రాజౌరీలో జరిగిన ఈ ఘటనలో పాల్గొన్నది నలుగురు ఉగ్రవాదులు. కేవలం 10 నిమిషాల్లోనే కాల్పులు సాగించి పారిపోయారు. మొదట వారు అప్పర్ డాంగ్రి ప్రాంతంలో ఓ ఇంటిపై దాడి చేసి.. ఆ తరువాత మరో ఇంటిలోకి దూరి కాల్పులు జరిపారు. అక్కడి నుంచి ఇలా నాలుగు ఇళ్లపై దాడులు చేశారు. ఈ దాడిలో 10 మందికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరణించిన వ్యక్తులను సతీష్ కుమార్ (45) దీపక్ కుమార్ (23) ప్రీతమ్ లాల్ (57) శిశుపాల్ (32)గా గుర్తించారు. పవన్ కుమార్ (38) రోహిత్ పండిట్ (27) సరోజ్ బాలా (35) రిధమ్ శర్మ (17) పవన్ కుమార్ (32) గాయపడ్డారు.రాజౌరీ పట్టణానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో అప్పర్ డాంగ్రీ గ్రామంలో ముష్కరులను పట్టుకునేందుకు ఆర్మీ సీఆర్ఫీఎఫ్ పోలీసులు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ దాడికి నిరసనగా పెద్ద ఎత్తున స్థానికులు నిరసన కార్యకర్తమాలు చేస్తున్నారు. వ్యాపార సంఘాలతో కలిసి ప్రజలు నిరసన తెలుపుతున్నారు.పాకిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదులను సమర్థంగా ఎదుర్కోవడం లేదని ఆరోపిస్తూ.. లెఫ్టినెంట్ గవర్నర్ భద్రతా సంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జమ్మూ కాశ్మీర్ బిజెపి అధ్యక్షుడు రవీందర్ రైనా ఈ సంఘటనను ఖండించారు. ఇది పాకిస్తానీ ఉగ్రవాదుల “పూర్తి పిరికిపంద చర్య” అని అభివర్ణించారు. ఉగ్రవాదులను ఉగ్రవాద మద్దతుదారులను తుడిచిపెడతామని ప్రతిజ్ఞ చేశారు.

Leave A Reply

Your email address will not be published.